నిన్న సాయంత్రం హైదరాబాద్‌లో నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం మునుగోడు ఉపఎన్నికల ఫలితాలను తారుమారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికీ బిజెపి నిజంగా రూ.100 కోట్లు చొప్పున ఆఫర్ చేసిందా లేక రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, బిజెపి నేతలు ఆరోపిస్తున్నట్లు కేసీఆరే ఢిల్లీలో కూర్చొని ఈ స్క్రిప్ట్ తయారుచేసి తన ఎమ్మెల్యేల చేత ఈ డ్రామా ఆడించారా?అనేది మున్ముందు తెలుస్తుంది.
అయితే ఈ వ్యవహారంతో మునుగోడు ఉపఎన్నికలలో టిఆర్ఎస్ పైచేయి సాధించేందుకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇప్పటికే మంత్రులు, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు, టిఆర్ఎస్ సొంత పత్రికలో రాష్ట్రంలో బిజెపి నేతలు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారంటూ జోరుగా ప్రచారం మొదలుపెట్టశారు. ఈ వ్యవహారంలో నిజానిజాలు ఏమిటని తెలుసుకొనేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపరు కనుక టిఆర్ఎస్ వాదనలను నిజమని నమ్మవచ్చు లేదా టిఆర్ఎస్ నేతలే తమ వాదనలతో ప్రజలను ఆకట్టుకోగల సమర్దులు.
బిజెపిని ఓడించడానికి బిజెపి నాయకుడు జగన్నాధంకి మంత్రి కేటీఆర్ ఫోన్ చేసి మద్దతు కోరినప్పటి పరిస్థితికి, ఇప్పటి పరిస్థితికి చాలా తేడా వచ్చిందనే చెప్పవచ్చు. కనుక మిగిలిన ఈ వారం రోజులలో మునుగోడులో బిజెపి ఏదో అద్భుతం చేస్తే తప్ప ఈ ఉపఎన్నికలలో ఓటమి తప్పకపోవచ్చు. ఇప్పటికే మునుగోడులో బిజెపి అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోట్ల రూపాయలు ఖర్చుచేసేశారు. అదంతా ఈ ఒకే ఒక వ్యవహారంతో ఏట్లో పిసికిన చింతపండుగా మారనుంది. ఇది కేసీఆర్ వ్యూహమనుకోవాలా లేక అదృష్టమనుకోవాలా?