ఆ డ్రామాకు కేసీఆరే డైరెక్టర్, స్క్రిప్ట్ రైటర్: బండి సంజయ్

October 27, 2022


img

నలుగురు టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పందించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఈ డ్రామాకు సిఎం కేసీఆరే డైరెక్టర్, స్క్రిప్ట్ రైటర్. పది రోజులు ఢిల్లీలో కూర్చొని ఆయన చేసిన పని ఇదే. అక్కడే ఆయన ఈ కుట్రకు ప్లాన్ రెడీ చేశారు. అక్కడే స్వామీజీలను పిలిపించుకొని వారితో మాట్లాడి ముందుగానే అంతా ప్లాన్ చేసుకొని నిన్న హైదరాబాద్‌లో తన ఎమ్మెల్యేలచేత ఈ డ్రామా ఆడించి బిజెపిపై బురదజల్లాలని ప్రయత్నించారు. 

దుబ్బాక, హుజురాబాద్‌ ఉపఎన్నికలలో ఎదురుదెబ్బలు తిన్న కేసీఆర్‌ మునుగోడులో కూడా టిఆర్ఎస్‌ ఓటమి తప్పదని గ్రహించి ఈ డ్రామా ఆడించారు. సిఎం కేసీఆర్‌ నిజంగా ఈ తప్పు చేయలేదని భావిస్తున్నట్లయితే యాదాద్రి ఆలయంలో తన భార్యాబిడ్డలపై ప్రమాణం చేసి తాను ఈ కుట్ర చేయలేదని చెప్పాగలరా? మేము ఏ తప్పు చేయలేదు. నేను కానీ మా బిజెపిలో మరెవరైనా యాదాద్రికి వచ్చి ప్రమాణం చేయడానికి సిద్దమే. కేసీఆర్‌ నా సవాల్ స్వీకరించే ధైర్యం ఉందా? 

కేసీఆర్‌ ఢిల్లీ నుంచి తిరిగివచ్చిన తర్వాత ఆ నలుగురు ఎమ్మెల్యేలలో ఒకరు ప్రతీరోజు ఉదయం, రాత్రి ప్రగతి భవన్‌కు వెళ్ళివస్తుండటం నిజం కాదా? మునుగోడుకి చెందిన ఓ టిఆర్ఎస్‌ నేత మూడు రోజులుగా ఫిల్మ్ నగర్‌లో డెక్కన్ కిచెన్ హోటల్‌లో మకాం వేసి ఈ డ్రామాకు రంగం సిద్దం చేస్తున్నారు. సిఎం కేసీఆర్‌కు దమ్ముంటే గత మూడు నాలుగు రోజులుగా ఆ హోటల్‌లోను, టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే ఫాంహౌసులోవి, ప్రగతి భవన్‌లోను రికార్డ్ అయిన సిసి కెమెరా రికార్డింగులను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నాను. అలాగే పోలీసులు అరెస్ట్ చేసిన ముగ్గురు స్వామీజీల కాల్ రికార్డ్స్ కూడా బయటపెడితే, ఈ కుట్ర వెనక కేసీఆరే ఉన్నారనే విషయం బయటపడుతుంది. 

అయినా నెత్తి మీద రూపాయి పెడితే అర్దరూపాయికి కూడా అమ్ముడుపోనీ ఆ నలుగురు ఎమ్మెల్యేలను ఎవరు కొంటారు?ఆ నలుగురు వచ్చే ఎన్నికలలో ఓడిపోవడం ఖాయం అని తెలిసే సిఎం కేసీఆర్‌ వారిని ఈ వ్యవహారంలో బకరాలుగా ఇరికించారు. వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్ళి వాంగ్మూలం తీసుకోకుండా పోలీసులు ఎందుకు వదిలేశారు. ఈ డ్రామా ముగియగానే వారు నలుగురు నేరుగా ప్రగతి భవన్‌కి ఎందుకు వెళ్ళారు?

ఒకవేళ ఎమ్మెల్యేలతో బేరసారాలు చేయాలనుకొంటే ఏ పార్టీ అయినా స్వామీజీలను పంపిస్తుందా?హిందూ మతమన్నా, స్వామీజీలన్నా సిఎం కేసీఆర్‌కి చాలా చులకన. అందుకే వారిని మద్యలో పెట్టి ఈ డ్రామా ఆడారు. దీనికి కేసీఆర్‌ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు,” అని బండి సంజయ్‌ హెచ్చరించారు.


Related Post