తెలంగాణలో ఓటుకి నోటు వ్యవహారం ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. హైదరాబాద్ నగరంలో బుదవారం మళ్ళీ అటువంటి మరో వ్యవహారం బయటపడింది. ఈసారి కూడా పోలీసులకు ముందే సమాచారం అందడంతో వలపన్ని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
ఈసారి ఆ వలలో బిజెపి తరపున వచ్చిన ముగ్గురు వ్యక్తులు డబ్బు సంచులతో పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. వారు నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలుచేయడానికి వచ్చినట్లు సైబరాబాద్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
వివరాల్లోకి వెళితే... టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు (అచ్చంపేట), రేగా కాంతారావు (పినపాక), హర్షవర్ధన్ రెడ్డి (కొల్లాపూర్), రోహిత్ రెడ్డి (తాండూరు) బిజెపిలో చేరితే ఒక్కొక్కరికీ రూ.100 కోట్లు, కాంట్రాక్టులు ఇస్తామని బిజెపి తరపున రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్ అనే ముగ్గురు వ్యక్తులు ఎర వేసి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు మొదలుపెట్టారు.
వీరిలో రామచంద్ర భారతి అలియాస్ సతీష్ శర్మ ఢిల్లీకి సమీపంలో ఫరీదాబాద్‌లో ఓ ఆలయంలో పనిచేస్తుంటారు. స్వామీ సింహయాజీ ఏపీలోని అన్నమయ్య జిల్లాలో శ్రీమంత్రరాజ మఠాధిపతి కాగా మూడో వ్యక్తి నందకుమార్ హైదరాబాద్‌లో హోటల్ బిజినెస్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారిలో నందకుమార్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి దగ్గర బంధువు, ఇద్దరూ కలిసి వ్యాపారాలు కూడా చేస్తున్నారు. ఆ పరిచయంతోనే నందకుమార్ మొదట రోహిత్ రెడ్డితో సంప్రదింపులు జరిపి మిగిలిన ముగ్గురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను బిజెపిలో చేర్చేందుకు బేరం సెటిల్ చేసినట్లు సమాచారం.
అయితే ఎమ్మెల్యేలు ఈవిషయం ముందే తమ అధినేత కేసీఆర్‌కు తెలియజేయడంతో వెంటనే ఆయన సైబరాబాద్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్రను అప్రమత్తం చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్న బిజెపి ప్రతినిధులను రెడ్-హ్యాండ్‌గా పట్టుకోవాలని ఆదేశించారు. దాంతో సిఐడీ, సైబరాబాద్ పోలీసులు హైదరాబాద్ శివార్లలో మొయినాబాద్ వద్ద అజీజ్ నగర్‌లో గల తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫాంహౌసు వద్ద కాపుకాసి ఈ వ్యవహారం జరుగుతున్నప్పుడు హాటాత్తుగా లోపలకి ప్రవేశించి ముగ్గురిని అరెస్ట్ చేశారు.
బుదవారం సాయంత్రం 5 గంటలకు నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెండు కార్లలో ఫాంహౌస్ చేరుకోవడంతో ఈ వ్యవహారం మొదలైంది. ఆ తర్వాత రెండు డబ్బు సంచులతో టిఎస్ 07హెచ్ 2777 నంబరు గల వాహనంలో బిజెపి ప్రతినిధులు ముగ్గురూ ఫాంహౌస్ చేరుకొన్నారు. అప్పటికే అక్కడ మారువేషాలతో కాపు కాసి ఉన్న సిఐడీ పోలీసులు నిందితులు ముగ్గురూ ఫాంహౌసులోకి ప్రవేశించారని సమాచారం ఇవ్వగానే, సాయంత్రం 6.30 గంటలకు శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, రాజేంద్రనగర్ ఏసీపీ, మొయినాబాద్ పోలీసులు అక్కడకు చేరుకొని బిజెపి ప్రతినిధులు ముగ్గురినీ అరెస్ట్ చేశారు. తర్వాత స్టీఫెన్ రవీంద్ర కూడా అక్కడకు చేరుకొని ఈ వ్యవహారం గురించి మీడియాకు క్లుప్తంగా వివరించారు.
స్టీఫెన్ రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ, బిజెపి తరపున వారు ముగ్గురు ఎమ్మెల్యేలతో మాట్లాడి ముందుగా రూ. 15 కోట్లు అడ్వాన్స్ ఇచ్చేందుకు తమ కార్లలో డబ్బు సంచులు కూడా తీసుకువచ్చారని చెప్పారు. ఆ డబ్బు, వారి వాహనాలు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని వారిని అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. వారు టిఆర్ఎస్ నేతలను ప్రలోభ పెడుతున్నట్లు ముందుగానే తమకు సమాచారం అందిందని తెలిపారు. అయితే వారిని ప్రశ్నించిన తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్పారు. ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు జరిపి చట్టపరమైన చర్యలు తీసుకొంటామని చెప్పారు.
టిఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మీడియాతో మాట్లాడుతూ, “బిజెపిలో చేరమని మమ్మల్ని ప్రలోభపెట్టేందుకు మాకు ఒక్కొక్కరికీ రూ.100 కోట్లు ఆఫర్ ఇచ్చారు. కానీ ఇటువంటి ప్రలోభాలకు లొంగి తెలంగాణకు అన్యాయం చేయలేము. ఎట్టి పరిస్థితులలో తెలంగాణలో బిజెపి అరాచకాలు సాగనీయం. పూర్తి వివరాలను గురువారం వెల్లడిస్తాము,” అని చెప్పారు.