ప్రస్తుతం మునుగోడులో మూడు ప్రధాన పార్టీలు చాలా జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. నవంబర్ 3న పోలింగ్ జరుగబోతోంది కనుక రెండు రోజుల ముందుగా అంటే 1వ తేదీతో మునుగోడు ఉపఎన్నికల ప్రచారం ముగించవలసి ఉంటుంది. కనుక ఈ నెల 30వ తేదీన సిఎం కేసీఆర్ చండూరులో బహిరంగసభ నిర్వహించడానికి సిద్దం అవుతున్నారు. దీని కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు లక్ష మందితో బహిరంగసభ నిర్వహించి మునుగోడులో టిఆర్ఎస్ ఆధిపత్యాన్ని చాటుకొనేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు జనసమీకరణకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంలో అన్ని గ్రామాల నుంచి బస్సులు ఏర్పాటు చేస్తున్నారు.
ఆ మరుసటిరోజూ అక్కడే బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా బహిరంగసభ నిర్వహించబోతున్నారు. కనుక బిజెపి నేతలు కూడా తమ సభను విజయవంతం చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఉపఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న బిజెపి అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖర్చుకి వెనకాడకుండా ఖర్చు చేస్తుండటంతో టిఆర్ఎస్ కూడా ఆయనకు పోటీగా ఖర్చు చేయక తప్పడం లేదు.
కనుక టిఆర్ఎస్, బిజెపి అభ్యర్ధులు ఇద్దరికీ ఈనెల 30,31న నిర్వహించబోయే బహిరంగసభలు చాలా కీలకమైనవి. అప్పటికి పోలింగ్ మూడు రోజులే ఉంటుంది. కనుక టిఆర్ఎస్, బిజెపిల మద్య ఎటువంటి ఘర్షణలు జరుగకుండా అడ్డుకొనేందుకు భారీగా పోలీసులను మోహరించబోతున్నారు.
నవంబర్ 3వ తేదీన మునుగోడు ఉపఎన్నికలు జరుగుతాయి. నవంబర్ 6వ తేదీన ఓట్లు లెక్కించి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఉపఎన్నికలలో బిజెపి మూడో స్థానానికి పరిమితమవుతుందని సిఎం కేసీఆర్ చెప్పినప్పటికీ, టిఆర్ఎస్‌కి పోటీ ప్రధానంగా దానితోనే అని అందరికీ తెలుసు. ఒకవేళ ఈ ఉపఎన్నికలలో కూడా టిఆర్ఎస్ ఓడిపోయినట్లయితే రాష్ట్ర ప్రజలకు టిఆర్ఎస్ బలహీనపడుతోంది... అదే సమయంలో బిజెపి బలపడుతోందనే భావన ప్రజలలో కలగవచ్చు. ఇదీగాక బిఆర్ఎస్‌తో జాతీయ రాజకీయాలలో ప్రవేశించే ముందు కేసీఆర్‌కు మునుగోడులో విజయం సాధించడం చాలా అవసరం. అందుకే సిఎం కేసీఆర్ స్వయంగా ఎన్నికల ప్రచారసభకు సిద్దం అవుతున్నట్లు భావించవచ్చు.
అయితే ఈ విషయం బిజెపికి కూడా బాగా తెలుసు కనుకనే మునుగోడు ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ను ఏవిదంగానైనా ఓడించాలని చాలా పట్టుదలగా ఉంది. మరి రెండు పార్టీలలో దేని వ్యూహం ఫలిస్తుందో? ఏ పార్టీ విజయం సాధిస్తుందో తెలియాలంటే నవంబర్ 6వరకు ఎదురుచూడక తప్పదు.