వెంకట్ రెడ్డి ఓ కోవర్ట్... ఇంకా ఉపేక్షిస్తే పార్టీకే ప్రమాదం: సీతక్క

October 25, 2022


img

కాంగ్రెస్ పార్టీని కోమటిరెడ్డి సోదరులు ఇద్దరూ మోసం చేశారని ములుగు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ్ముడు పార్టీని మోసం చేసి బిజెపిలో చేరిపోగా, అన్న పార్టీలోనే ఉంటూ బిజెపి తరపున పోటీ చేస్తున్న తమ్ముడిని గెలిపించుకోవడానికి కోవర్టుగా పనిచేస్తున్నారని సీతక్క ఆరోపించారు. ఒకవేళ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తమ్ముడి మీద అంత ప్రేమ ఉంటే ఆయన కూడా పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరి మద్దతు పలకాలి కానీ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బిజెపిలో ఉన్న తమ్ముడికి మద్దతు పలకడం అంటే కాంగ్రెస్ పార్టీని మోసం చేయడమే అని సీతక్క అన్నారు.

ఇక్కడ మునుగోడులో కాంగ్రెస్‌ అభ్యర్ధి పాల్వాయి స్రవంతిని గెలిపించుకోవడానికి పార్టీ నేతలు, కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ ఎంతో కష్టపడి పనిచేస్తుంటే, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిసిగ్గుగా ఆస్ట్రేలియాలో జల్సాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి వ్యక్తులు పార్టీలో ఉంచుకొంటే పక్కలో పామును ఉంచుకొన్నట్లే అని, కనుక కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కాంగ్రెస్‌ పార్టీలో నుంచి బహిష్కరించడం మంచిదని సీతక్క అభిప్రాయం వ్యక్తం చేసారు. కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసు పంపించి పదిరోజులలోగా సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది. 

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పార్టీ పగ్గాలు ఆశిస్తున్న ఆయన పార్టీకి ఇంత ద్రోహం చేస్తుండటం, పార్టీకి అవసరమైనప్పుడు మొహం చాటేసి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళిపోవడం రెండూ తప్పే. కనుక సీతక్క సూచించినట్లు ఒకవేళ ఆయనకు కాంగ్రెస్ పార్టీ కంటే తమ్ముడే ముఖ్యమనుకొంటే పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరి మద్దతు ఇస్తే ఎవరూ ఇంతగా వేలెత్తి చూపరు. కానీ ఈవిదంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీ చేత మెడపట్టుకొని బయటకు గెంటించుకొనే పరిస్థితి తెచ్చుకొన్నారు. ఇది స్వయంకృతమే కనుక దీనికి ఆయన మూల్యం చెల్లించక తప్పదు.  


Related Post