దండుమల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్కు చూసొద్దామా?

October 25, 2022


img

ఉపఎన్నికలొస్తేనే సిఎం కేసీఆర్‌ అభివృద్ధిపనులు, సంక్షేమ పధకాలు ప్రకటిస్తారనే అపవాదు ఉంది. అది కొంతవరకు నిజమే అయినప్పటికీ, ఎన్నికలతో సంబందం లేకుండా రాష్ట్రంలో అన్ని జిల్లాలలోను ఇవన్నీ అమలుచేస్తూనే ఉన్నారు. ఇందుకు నిదర్శనంగా 2019, నవంబర్‌ 1వ తేదీన మునుగోడు పరిధిలోగల దండుమల్కాపూర్‌లో 1863 ఎకరాలలో ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కుకి ఐ‌టి పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ శంఖుస్థాపన చేశారు. దాని మొదటి దశలో భాగంగా 542 ఎకరాలలో రూపు దిద్దుకొన్న ఇండస్ట్రియల్ పార్కు కళ్లెదుటే కనబడుతోంది. దీనిలో ఇప్పటికే 50 చిన్న, మద్య పరిశ్రమలు ఉత్పత్తి చేస్తున్నాయి. వాటిలో సుమారు 3,000 మందికి పైగా ప్రత్యక్షంగా, అనేకమంది పరోక్షంగా ఉపాది పొందుతున్నారు. మరో 200 కంపెనీలు త్వరలో ఉత్పత్తి ప్రారంభించేందుకు సిద్దంగా ఉన్నాయి. 

ఈ ఇండస్ట్రియల్ పార్కులో సకల సౌకర్యాలు అందుబాటులో ఉండటంతో ఇక్కడ స్థలాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇక్కడ స్థలం దొరికితే చాలనుకొనే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు చాలామంది క్యూలైన్లో ఎదురుచూస్తున్నారంటే ఎంత డిమాండ్ ఉందో అర్దం చేసుకోవచ్చు. అందుకే ప్రస్తుతం వివిద దశలలో ఉన్న ఈ ఇండస్ట్రియల్ పార్కును రాబోయే రోజుల్లో మరో 1,863 ఎకరాలకు విస్తరించడానికి టిఎస్ఐఐసీ ప్రణాళికలు సిద్దం చేసుకొంటోంది. ఈ ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణ పనులన్నీ పూర్తయి, పరిశ్రమలన్నీ పనిచేయడం ప్రారంభిస్తే వాటిలో సుమారు 1.32 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. 

ప్రస్తుతం దండుమల్కాపూర్‌లో ఏర్పాటైన పరిశ్రమలలో, టైల్స్, సిమెంట్, లైట్ వెయిట్ ఇటుకలు, సోలార్ పరికరాలు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ప్యాకేజింగ్, గనులలో త్రవ్వకాలకు వినియోగించే యంత్రపరికరాల విడిభాగాలు, ఇంకా అనేక రకాల ఉత్పత్తులు తాయారవుతున్నాయి. వాటిలో కొన్ని విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి.      

చుట్టుపక్కల గల తూప్రాన్‌పేట, బాటసింగారం, దండుమైలారం, కొయ్యలగూడెం, చౌటుప్పల్‌, పీపలపాడు, సంస్థాన్‌ నారాయణపురం, లకారం తదితర గ్రామాలలో ప్రజలకు కూడా దండుమల్కాపూర్‌లో ఏర్పాటయిన పరిశ్రమలలో ఉద్యోగాలు, ఉపాధి లభిస్తుండటంతో ఇప్పుడు హైదరాబాద్‌లోని జీడిమెట్ల, ఉప్పల్, ఫతేనగర్‌లో వంటి పారిశ్రామికవాడలకు వెళ్ళే అవసరం తప్పింది. 


దండుమల్కాపూర్‌ ఇండస్ట్రియల్ పార్కులో ఏర్పాటవుతున్న పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు నేర్పించేందుకు అక్కడే 2.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరో రెండు నెలల్లో ఇది అందుబాటులోకి రానుంది.   

దండుమల్కాపూర్‌ ఇండస్ట్రియల్ పార్కులో రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, శిక్షణా కేంద్రం కొంస రాష్ట్ర ప్రభుత్వం రూ.236 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇక్కడ పనిచేసే ఉద్యోగులు, కార్మికుల కోసం 194 ఎకరాలలో సమీకృత నివాస సముదాయాలు (హౌసింగ్ కాలనీలు) కూడా నిర్మిస్తున్నారు. అక్కడే స్కూళ్ళు, కాలేజీలు, కూరగాయలు, కిరాణా దుకాణాలతో కూడిన మార్కెట్లు, బ్యాంకులు వగైరాలు కూడా ఉండేలా దీనిని నిర్మిస్తున్నారు. అంటే ఉద్యోగులు, కార్మికులు తమ ఇళ్ల నుంచి తాను పనిచేస్తున్న కంపెనీలకు నడుచుకొని వెళ్ళేవిదంగా (వాక్ టూ వర్క్) నిర్మిస్తున్నాయరన్న మాట! 



Related Post