రాహుల్ పాదయాత్రతో పాల్వాయి స్రవంతి ఓటమి ఖరారు?

October 24, 2022


img

కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిగా మల్లిఖార్జున ఖర్గే ఎన్నికై ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీలో నేటికీ మకుటం లేని యువరాజు రాహుల్ గాంధీయే. అటువంటి వ్యక్తి భారత్‌ జోడో యాత్రలో భాగంగా తెలంగాణలో ఈ నెల 23 నుంచి నవంబర్‌ 6వరకు పాదయాత్ర చేస్తున్నప్పుడు, పార్టీకి అత్యంత కీలకమైన మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఆశించడం సహజం. కానీ ఆయన రాష్ట్రంలో 15 రోజుల పాటు ఉంటున్నప్పటికీ, రాష్ట్రంలో 359 కిమీ పాదయాత్ర చేస్తున్నప్పటికీ, మునుగోడువైపు తొంగి చూడకపోవడం విస్మయం కలిగిస్తుంది. 

దీపావళి సందర్భంగా ఆయన నేడు రేపు పాదయాత్రకు విరామం ఇస్తున్నప్పుడు, మరో నాలుగు రోజులు బ్రేక్ తీసుకొని మునుగోడు ఉపఎన్నికలలో ఒంటరి పోరాటం చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్ధి పాల్వాయి స్రవంతికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఉంటే ఆమెకు ఎంతో మేలు జరిగి ఉండేది. ప్రజల దృష్టిలో రాహుల్ గాంధీ ఓ నిజమైన నాయకుడిగా గుర్తింపు పొంది ఉండేవారు. కానీ ఆయన ఒంటరి పోరాటం చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్ధి పాల్వాయి స్రవంతికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోగా ఆమె కోసం ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌ నేతలందరినీ కూడా తన వెనక పాదయాత్రలో తీసుకుపోతూ ఆమెను మరింత ఒంటరి చేయబోతున్నారు. 

ఇప్పటికే కోమటిరెడ్డి సోదరులిద్దరూ కలిసి ఆమెను దెబ్బ తీసేందుకు కుట్రలు చేస్తున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ చేస్తున్న ఈ పాదయాత్రతో అప్రయత్నంగానే ఆమెకు నష్టం కలిగించబోతున్నారు. ఉపఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ తెలంగాణ గుండా పాదయాత్ర చేస్తున్నప్పుడు తప్పనిసరిగా మునుగోడు నియోజకవర్గం గుండా సాగేలా ఎందుకు రూట్ మ్యాప్ చేయించలేకపోయారో తెలీదు కానీ ఇప్పటికే ఓటమి అంచున ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి ఈ పాదయాత్రతో ఉపఎన్నికలకు ముందే ఓడిపోబోతున్నారని చెప్పవచ్చు. 




Related Post