మునుగోడు ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే తాను పిసిసి అధ్యక్షుడుని అవుతానని కలలుగంటున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఈ ఉపఎన్నికలలో బిజెపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓట్లు వేయాలని కోరుతూ ఆయన మునుగోడులో కాంగ్రెస్ కార్యకర్తలకి ఫోన్లు చేయడం, ఈ ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని చెప్పడంపై రాష్ట్ర కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. పార్టీకి ఎంతో కీలకమైన ఉపఎన్నికల వేళ పార్టీకి అండగా నిలబడకపోగా, పార్టీకి నష్టం కలిగించేవిదంగా మాట్లాడారని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని ఆదేశించడంతో ఏఐసీసీ క్రమశిక్షణ ఉల్లంఘన కమిటీ కార్యదర్శి తారిఖ్ అన్వర్ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఈమెయిల్ ద్వారా షోకాజ్ నోటీస్ పంపారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి పార్టీకి నష్టం కలిగించేవిదంగా వ్యవహరించినందుకు మీపై క్రమశిక్షణ చర్య ఎందుకు తీసుకోరాదో నవంబర్ 1వ తేదీలోగా వివరించాలని నోటీసులో పేర్కొన్నారు.
నిజానికి ఆయన కూడా బిజెపిలో చేరేందుకు మూటాముల్లె సర్ధుకొని సిద్దంగా ఉన్నందునే ఈవిదంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కనుక నోటీసుకు సమాధానం చెప్పకుండా ఊరుకొని బహిష్కరణ వేటు వేయించుకొని పార్టీలో నుంచి బయటపడవచ్చని సమాచారం. మునుగోడు ఉపఎన్నికలు ముగియగానే ఆయన ఢిల్లీ వెళ్ళి బిజెపిలో చేరే అవకాశం ఉంది. నల్గొండ జిల్లాలో మంచి పట్టున్న ఆయన వంటి సీనియర్ నాయకుడుని వదులుకొంటే కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టమే. కానీ ఆయనను పార్టీలో ఉంచుకోవడం వలన ఈవిదంగా ఇంకా ఎక్కువ నష్టం జరుగుతోందని కొందరు సీనియర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కనుక ఆయనను బయటకు సాగనంపడమే మంచిదని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో దశాబ్ధాలుగా పనిచేసిన కోమటిరెడ్డి సోదరులు ఈవిదంగా పార్టీకి ద్రోహం చేసి బయటకు వెళుతుండటం చాలా బాధాకరమే!