టిఆర్ఎస్, బిజెపిల మద్య మునుగోడులో జరుగుతున్న మ్యాచ్ అప్పుడే రసవత్తరంగా మారింది. రెండు రోజుల క్రితం టిఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ రాజీనామా చేసి బిజెపిలో చేరగా, నిన్న ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ బిజెపికి రాజీనామా చేసి మళ్ళీ టిఆర్ఎస్ గూటికి చేరుకొన్నారు.
బిజెపి ఆ షాక్ నుంచి తేరుకొనేలోపే ఈరోజు ఉదయం దాసోజు శ్రవణ్ కుమార్ బిజెపికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మరికొద్ది సేపటికే మరో సీనియర్ నేత, శాసనమండలి మాజీ స్పీకర్ స్వామి గౌడ్ కూడా బిజెపికి రాజీనామా చేశారు. వారిద్దరూ మరికొద్దిసేపటిలో తెలంగాణ భవన్‌లో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.
టిఆర్ఎస్‌ను దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతోనే మునుగోడు ఉపఎన్నికలను తెచ్చిపెట్టి తమను చికాకు పెడుతున్నందుకు టిఆర్ఎస్ నేతలు కూడా బిజెపిని ఈవిదంగా దెబ్బతీస్తున్నారు. ఆపరేషన్ స్వగృహ పేరుతో టిఆర్ఎస్ నుంచి బిజెపిలోకి వెళ్ళిన నేతలను వెనక్కు రప్పించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమాలలో చురుకుగా పనిచేసిన ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో కేటీఆర్ తదితర ముఖ్య నేతలు టచ్చులో ఉన్నట్లు తెలుస్తోంది. వారు కూడా టిఆర్ఎస్‌లోకి తిరిగి వచ్చేందుకు అంగీకరించారని, అయితే అందరినీ ఒకేరోజు కాకుండా మునుగోడు ఉపఎన్నికలు మొదలయ్యే వరకు ఒకరొకరిగా పార్టీలో చేర్చుకొంటూ బిజెపిని దెబ్బతీయాలని టిఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కనుక మునుగోడు మ్యాచ్ ముగిసేసరికి ఏ టీమ్‌లో ఎంతమంది మిగులుతారో? ఏ టీం ఈ మ్యాచ్ గెలుస్తుందో చూడాలి.