తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా టిఆర్ఎస్, బిజెపిలను నిత్యం చీల్చి చెందాడిన దాసోజు శ్రవణ్ కుమార్ కొన్ని నెలల క్రితం హటాత్తుగా హస్తం పార్టీకి హ్యాండిచ్చి బిజెపిలో చేరిపోయారు. కాషాయం కండువా తనకు సూట్ అవలేదనుకొన్నారో ఏమో ఇవాళ్ళ టిఆర్ఎస్ కారు ఎక్కబోతున్నారు. ఈరోజు సాయంత్రం తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన టిఆర్ఎస్‌లో చేరబోతున్నారు.
మునుగోడు ఉపఎన్నికలకు ముందు టిఆర్ఎస్ నుంచి బిజెపి బూర నర్సయ్య గౌడ్‌ని ఎత్తుకుపోతే, టిఆర్ఎస్ పార్టీ బిజెపిలో నుంచి ఇద్దరు నేతలని ఎత్తుకుపోతోంది. భిక్షమయ్య గౌడ్ నిన్ననే గులాబీ కండువా కప్పుకొని మళ్ళీ టిఆర్ఎస్ గూటికి చేరుకోగా, నేడు కారు ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసుకొనేందుకు దాసోజు శ్రవణ్ కుమార్ గులాబీ కండువా కప్పుకొని కారెక్కబోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు టిఆర్ఎస్, బిజెపిలను, మోడీ, కేసీఆర్‌లను తిట్టిన తిట్టు మళ్ళీ తిట్టకుండా తిట్టిపోసిన దాసోజు శ్రవణ్ కుమార్ ఇప్పుడు ఆ పార్టీలలోనే చేరుతుండటం విశేషం. బిజెపిలో ఉన్నప్పుడు మోడీని పొగిడిన ఆయన ఇప్పుడు టిఆర్ఎస్‌లో చేరిన తర్వాత కేసీఆర్ కోణంలో నుంచి మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీపై విమర్శలు గుప్పించవలసి ఉంటుంది. ఆయన చిత్తశుద్ధికి అదే పరీక్ష. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా దాసన్న ఆ పని విజయవంతంగా చేసిన అనుభవం ఉంది కనుక ఈ పరీక్షలో సులువుగానే పాస్ అవుతారని భావించవచ్చు. కానీ ఇప్పటికే కిక్కిరిసిపోయున్న గులాబీ కారులో ఆయన ఎంతకాలం ప్రయాణించగలరో చూడాలి.