అవును బిజెపి నేతకి నేను ఫోన్‌ చేశా: కేటీఆర్‌

October 21, 2022


img

టిఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ మూడు రోజుల క్రితం బిజెపి నాయకుడు జగన్నాధంకు ఫోన్‌ చేసి మునుగోడు ఉపఎన్నికలలో తమ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకొనేందుకు మద్దతు ఇమ్మనమని అభ్యర్ధించారు.

నిన్న బిజెపి నేత, ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్‌ మళ్ళీ టిఆర్ఎస్‌ గూటికి తిరిగిచేరుకొన్న సందర్భంగా కేటీఆర్‌ను ఓ విలేఖరి ఇదే విషయం ప్రశ్నించినప్పుడు, “అవును. నేనే బిజెపి నేతకి ఫోన్‌ చేసి మద్దతు అడిగాను. ఏం తప్పా? నేనేమి కేంద్ర ప్రభుత్వంలాగా ఆయనకు వేలకోట్లు కాంట్రాక్ట్ ఇస్తానని ప్రలోభపెట్టలేదే? మా ప్రభుత్వం అమలుచేస్తున్న పధకాల గురించి వివరించాను. తనకి కూడా రైతుబంధు పధకం అందుతోందని ఆయనే ఒప్పుకొన్నారు. మరి పధకాలు ఇచ్చి మద్దతుకోరితే తప్పేముంది? ఆయనకే కాదు కాంగ్రెస్‌, బిజెపి నేతలలో చాలా మందికి రైతుబంధు తదితర పధకాలు పొందుతున్నారు. కనుక వారందరినీ మాకే ఓటు వేయమని అడిగే హక్కు మాకుంది. మునుగోడు ఉపఎన్నికలలో బిజెపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫోన్‌ నంబర్ ఉంటే ఆయనకీ ఫోన్‌లో చేసి మాపార్టీకే ఓటేయమని చెపుతాము,” అంటూ రాజగోపాల్ రెడ్డి ఎందుకు పార్టీ మారారో, ఎందుకు రాజీనామా చేసి ఎన్నికలు తెచ్చిపెట్టారో కేటీఆర్‌ వివరించారు. 

ఉపఎన్నికలకు ముందు కేటీఆర్‌ ఈవిదంగా ప్రత్యర్ధి పార్టీ నేతకి ఫోన్‌ చేసి మద్దతుకోరడం చాలా అవమానమకరమైన విషయమే. కానీ కేటీఆర్‌ తన వాక్చాతుర్యంతో దానిని ఇంత చక్కగా సమర్ధించుకోవడం విశేషం. కానీ మునుగోడులో టిఆర్ఎస్‌ను ఏదో విదంగా గెలిపించుకోవాలనే కేటీఆర్‌ బిజెపి నేత సాయం కోరడానికి కూడా వెనకాడలేదని అర్దం అవుతోంది. ఇదే పని బిజెపి నేతలు ఎవరైనా చేస్తే కేటీఆర్‌, టిఆర్ఎస్‌ నేతల స్పందన ఏవిదంగా ఉంటుందో ఊహించుకోవచ్చు.

 

(వీడియో: ఈనాడు సౌజన్యంతో)

Related Post