తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మునుగోడు మండలం కొంప్లల్లిలో మీడియాతో మాట్లాడుతూ, “మునుగోడు ఉపఎన్నికల తర్వాత నన్ను పిసిసి అధ్యక్ష పదవి నుంచి తొలగించడానికి పెద్ద కుట్ర జరుగుతోంది. నేను పిసిసి అధ్యక్షుడిగా నియమింపబడటం ఇష్టంలేని పార్టీలో కొందరు సీనియర్లు నాపై కక్షగట్టి పార్టీలో నన్ను ఒంటరిగా చేశారు. ఈ ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఓడించడం ద్వారా నన్ను గద్దె దించేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఈ పదవి నాకు ఇచ్చినప్పటి నుంచి టిఆర్ఎస్, బిజెపిల నుంచి నేను తీవ్ర ఒత్తిళ్ళు ఎదుర్కొంటున్నాను. రాష్ట్రంలో, జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టేసేందుకు కేసీఆర్ బిజెపి పెద్దల నుంచి సుపారి తీసుకొన్నారు. ఇందుకోసమే ఆయన ఢిల్లీలో పది రోజులు మకాం వేసి వారితో మంతనాలు జరిపి వచ్చారు. కనుక కాంగ్రెస్ పార్టీని కాపాడుకొనేందుకు మనం అందరం కలిసి పనిచేయాలని కార్యకర్తలందరినీ నేను చేతులు జోడించి ప్రార్ధిస్తున్నాను. నాకు ఈ పదవి ముఖ్యం కాదు కాంగ్రెస్ పార్టీయే ముఖ్యం. పార్టీ కోసం ప్రాణత్యాగానికి కూడా వెనకాడను,” అని అన్నారు.
రేవంత్ రెడ్డి అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నప్పుడే పార్టీలో సీనియర్లు తనని వ్యతిరేకిస్తున్నారని, వారి సహకారం లేనిదే పార్టీని నడిపించడం సాధ్యం కాదని తెలుసు. అయినా ఢిల్లీలో లాబీయింగ్ చేసుకొని పదవి సంపాదించుకొని ఇప్పుడు ఈవిదంగా బాధపడి ప్రయోజనం ఏమిటి?
కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ అంతటివాడి కుర్చీ కిందే సీనియర్లు మంట పెట్టేసి మళ్ళీ ఆ కుర్చీలో కూర్చోనీకుండా చేశారు. రాష్ట్రంలో సీనియర్లు తనని కూర్చొనిస్తారని రేవంత్ రెడ్డి అనుకోవడం అత్యశే! అయినా కాంగ్రెస్ పార్టీలో ఈ కుర్చీలాట ఈరోజు కొత్తగా మొదలైంది కాదు. నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది. కనుక ఆ వేడి భరిస్తూ ఎవరు ఎక్కువ కాలం ఆ కుర్చీలో కూర్చోగలరనేదే లెక్క. రేవంత్ రెడ్డి ఆ కుర్చీలో కూర్చొని అప్పుడే ఏడాదిన్నర. కనుక ఆ అసమ్మతి వేడి భరిస్తూ ఇంత కాలం ఆ కుర్చీలో కూర్చోగలిగినందుకు సంతోషించాలే తప్ప బాధపడకూడదు. రేవంత్ రెడ్డిని పార్టీలో నేతలే గద్దె దించుతారా లేక కేసీఆర్ గద్దె దించుతారా? ఎప్పుడు దించుతారు?అనేదే ప్రశ్న. అయినా ఈ సెగలు, పొగలు భరిస్తూ ఆ ముళ్ళ కుర్చీలో ఎందుకు కూర్చోవాలనుకొంటున్నారో తెలీదు కానీ కూర్చోవాలనుకొంటే ఇవన్నీ భరించక తప్పదు.
రాష్ట్రంలో కేసీఆర్, జాతీయస్థాయిలో మోడీ, అమిత్ షాలు కాంగ్రెస్ పార్టీని ఎప్పుడో ఖతం చేసేశారు. అందుకే రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టకుండా భారత్ జోడో వంకతో దేశాటన చేస్తూ లోకజ్ఞానం పెంచుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. కనుక మునుగోడు ఉపఎన్నికల తర్వాత పదవి కోల్పోతే రేవంత్ రెడ్డి కూడా ‘తెలంగాణ జోడో’ చేసుకోవలసి రావచ్చునేమో?