మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్‌గా మిర్యాలగూడ ఆర్డీవో

October 20, 2022


img

మునుగోడు ఉపఎన్నికలలో ఓ అభ్యర్ధికి కేటాయించిన రోడ్ రోలర్ గుర్తుని మార్చినందుకు రిటర్నింగ్ ఆఫీసర్‌ జగన్నాధరావుని ఆ విధులలో నుంచి తొలగించిన కేంద్ర ఎన్నికల కమీషన్‌ మిర్యాలగూడ ఆర్డీవోగా చేస్తున్న రోహిత్‌ సింగ్‌ను ఆర్‌వోగా నియమిస్తూ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. 

దీనిపై టిఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ తీవ్ర అభ్యంతరం చెప్పారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల కమీషన్‌ కేంద్ర ప్రభుత్వం ఒత్తిడికి లొంగిపనిచేస్తున్నట్లు దీంతో స్పష్టమైందని అన్నారు. గత ఎన్నికల సమయంలో టిఆర్ఎస్‌ అభ్యర్ధన మేరకు టిఆర్ఎస్‌ ఎన్నికల చిహ్నామైన కారు గుర్తుని పోలి ఉన్న రోడ్ రోలర్‌ గుర్తును ఎన్నికల గుర్తుల జాబితా నుంచి తొలగించారని కానీ మళ్ళీ ఇప్పుడు దానిని ఎందుకు వేరే అభ్యర్ధులకు కేటాయించాలని కేంద్ర ఎన్నికల కమీషన్‌ పట్టుబడుతోందని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. రిటర్నింగ్ ఆఫీసర్‌ జగన్నాధరావు సక్రమంగా తన బాధ్యత నెరవేర్చితే, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు కేంద్ర ఎన్నికల కమీషన్‌ ఆయనను హడావుడిగా పదవిలో తప్పించేసిందని కేటీఆర్‌ అన్నారు. మునుగోడు ఉపఎన్నికలలో బిజెపి ఓడిపోతుందనే భయంతోనే కేంద్ర ఎన్నికల కమీషన్‌పై కేంద్రం ఒత్తిడి తెచ్చి చివరి నిమిషంలో రిటర్నింగ్ ఆఫీసర్‌ను మార్పించిందని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. 

ఒకవేళ కేటీఆర్‌ ఆరోపిస్తున్నట్లు కేంద్రం కేంద్ర ఎన్నికల కమీషన్‌పై ఒత్తిడి తెచ్చి ఆర్వోని మార్చడం నిజమనుకొంటే, విధుల నుంచి తొలగించబడిన ఆర్వో జగన్నాధ రావుపై టిఆర్ఎస్‌ ప్రభుత్వం కూడా ఒత్తిడి తెచ్చి రోడ్ రోలర్ గుర్తును తొలగించినట్లు భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే, కారుని పోలి ఉన్న 8 ఎన్నికల గుర్తులు మార్చాలని టిఆర్ఎస్‌ ఎన్నికల సంఘానికి, హైకోర్టుకి చేసిన విజ్ఞప్తిని తిరస్కరించిన తర్వాతే జగన్నాధ రావు రోడ్ రోలర్ గుర్తును మార్చారు కనుక! ఎన్నికల సంఘం, హైకోర్టు వద్దని చెప్పినా మార్చారంటే ఆయనపై టిఆర్ఎస్‌ ప్రభుత్వం ఒత్తిడి చేసిందనే కదా అర్దం?  



Related Post