మునుగోడు ఉపఎన్నికలలో రోజుకో కొత్త వివాదం పుట్టుకొస్తోంది. ముందు పోస్టర్స్ యుద్ధం, తర్వాత ఎన్నికల గుర్తుల వివాదం, నిన్న చౌటుప్పల్‌లో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకి సమాధి కట్టడం తాజాగా మునుగోడు రిటర్నింగ్ అధికారి కె.శివకుమార్ అనే అభ్యర్ధికి కేటాయించిన రోడ్డు రోలర్ గుర్తును మార్చేసి బేబీ వాకర్ గుర్తు కేటాయించడం వంటి అనూహ్య పరిణామాలు వరుసగా జరుగుతున్నాయి. మళ్ళీ ఆ అభ్యర్ధికి రోడ్డు రోలర్ గుర్తు కేటాయించి రిటర్నింగ్ అధికారిపై విచారణ జరిపి, అతని వివరణ కూడా సంర్పించాలని కేంద్ర ఎన్నికల కమీషన్ ఈరోజు ఉదయం ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల కమీషన్ సూచన మేరకు సదరు రిటర్నింగ్ అధికారిని విధులలో నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించింది. ఆయన స్థానంలో మరో ముగ్గురి పేర్లను సిఫార్సు చేస్తూ కేంద్ర ఎన్నికల కమీషన్‌కు పంపించింది. వారిలో ఒకరిని మునుగోడు ఉపఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా కేంద్ర ఎన్నికల కమీషన్ నియమించనుంది.
రోడ్డు రోలర్ గుర్తును మార్చడం ద్వారా సదరు అధికారి టిఆర్ఎస్‌కు పరోక్షంగా మేలు చేశారని అర్దమవుతూనే ఉంది. ఉపఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు ఆయన స్థానంలో రాబోతున్న వ్యక్తి మునుగోడులో టిఆర్ఎస్ పార్టీపై దృష్టి పెట్టడం ఖాయం. కనుక ఈ మార్పు టిఆర్ఎస్‌కు ఇబ్బందికరంగా మారవచ్చు.