ఓ ఎమ్మెల్యేగా ఏమీ చేయలేకపోయాను అందుకే రాజీనామా చేశా!

October 20, 2022


img

ఈ మాట అన్నది ఎవరో అందరికీ తెలుసు. మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి! గత నాలుగేళ్ళుగా ఎమ్మెల్యేగా ఉన్న తాను తెలంగాణ ప్రభుత్వం సహకరించకపోవడం వలన మునుగోడు నియోజకవర్గం అభివృద్ధికి ఏమీ చేయలేకపోయానని ఆయనే స్వయంగా చెప్పుకొన్నారు. నేటికీ ట్విట్టర్‌లో చెప్పుకొంటున్నారు కూడా. 

“మా అమ్మ సుశీలమ్మ పేరు మీద ఫౌండేషన్ పెట్టి కరోనా కాలంలో పేద ప్రజలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశాను. వేల కుటుంబాలకు కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేశాను. మానవత్వంతో మనిషిగా ఎవరికైనా సహాయం చేయగలను, కానీ ఒక ఎమ్మెల్యేగా ఈ ప్రాంత అభివృద్ధి చేయలేనప్పుడు నేనేం చేయాలి. అందుకే రాజీనామా చేశా !” అని నిన్ననే ట్వీట్ చేశారు. 

అప్పుడూ, ఇప్పుడూ కూడా టిఆర్ఎస్‌ ప్రభుత్వమే అధికారంలో ఉంది. కనుక మళ్ళీ ఇప్పుడు ఆయనను మరోసారి గెలిపిస్తే మాత్రం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేరు కదా? మరి అటువంటప్పుడు మునుగోడు ప్రజలు మళ్ళీ ఆయనకు ఎందుకు ఓట్లు వేయాలి? ఆయన వారి నమ్మకాన్ని వమ్ము చేయడమే కాకుండా తన రాజకీయ అవసరాల కోసం బలవంతంగా ఉపఎన్నికలు తెచ్చిపెట్టారు. అందుకు ఆయన పశ్చాత్తాపపడవలసి ఉండగా, ధర్మపోరాటం, ప్రజాపోరాటం అంటూ సొల్లు కబుర్లు చెపుతూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. 

ఆయన చేసిన తప్పును సరిద్దిద్దుకోకపోవచ్చు కానీ ఆయన ఇచ్చిన ఈ అవకాశంతో మునుగోడు ఓటర్లు తమ తప్పును సరిదిద్దుకొనే అవకాశం కల్పించారు. ఇక ఎమ్మెల్యేగా మునుగోడుకి ఏమీ చేయలేకపోయానని ఆయనే స్వయంగా ఒప్పుకొంటున్నారు. కనుక మునుగోడు ఓటర్లు ప్రలోభాలు, మాయ మాటలకు లొంగిపోకుండా సరైన నిర్ణయం తీసుకోవలసిన అవసరం చాలా ఉంది. ఈ ఉపఎన్నికలు వారి విజ్ఞతకు పరీక్ష. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు వారి నిర్ణయం ఏవిదంగా ఉంటుందో అని ఎదురుచూస్తున్నారు. 


Related Post