టిఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మునుగోడు ఉపఎన్నికలకు ముందు పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరడం టిఆర్ఎస్‌కి పెద్ద షాక్ అనే చెప్పవచ్చు. అయితే టిఆర్ఎస్‌కు చెందిన ఓ మాజీ మంత్రి తమతో టచ్చులో ఉన్నారని, సరైన సమయం చూసుకొని బిజెపిలో చేరుతారని బిజెపి రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ మరో బాంబు పేల్చారు. మునుగోడు ఉపఎన్నికల తర్వాత టిఆర్ఎస్ నుంచి చాలా మంది బిజెపిలోకి రాబోతున్నారని కె లక్ష్మణ్ చెప్పారు.
తెలంగాణ ఉద్యమ సమయం నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీస్తున్నది సిఎం కేసీఆర్ అని అందరికీ తెలుసని కనుక ఆయన బిఆర్ఎస్‌తో జాతీయ రాజకీయాలలో ప్రవేశించినా ఆయనతో ఎవరూ చేతులు కలపరని అన్నారు. ఇన్నేళ్ళుగా మునుగోడుని పట్టించుకోని మంత్రి కేటీఆర్ ఇప్పుడు ఉపఎన్నికలు రాగానే నియోజకవర్గాన్ని దత్తత తీసుకొంటానని, అభివృద్ధి చేస్తానని హామీలు గుప్పిస్తున్నారని కె లక్ష్మణ్ ఆరోపించారు.
ఆయన తండ్రి కేసీఆర్‌కి కూడా ఎన్నికలు వస్తేనే ప్రజలు, వారి బాధలు గుర్తుకు వస్తాయని అందుకే హడావుడిగా చర్లగూడెం భూనిర్వాసితుల ఖాతాలలో డబ్బు జమా చేశారని అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయకుంటే వారికి ఎన్నటికైనా డబ్బు వచ్చేదా?అని వారే ఆలోచించుకోవాలని అన్నారు. మునుగోడులో టిఆర్ఎస్, కాంగ్రెస్ డూప్ ఫైట్స్ చేస్తున్నాయని, అసలు యుద్ధం తమతోనే అని అన్నారు. మునుగోడులో బిజెపి విజయం ఖాయమని తేలిపోయిందని కె లక్ష్మణ్ అన్నారు.
బిజెపిలో చేరాలనుకొంటున్న మాజీ మంత్రులలో ప్రధానంగా కనిపిస్తున్నవారు జూపల్లి కృష్ణారావు, కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వర రావు. వారు ముగ్గురూ గత ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగారు కానీ ఆ తర్వాత సిఎం కేసీఆర్ వారిని పట్టించుకోవడం మానేశారు. అయినప్పటికీ వారు చాలా సంయమనం పాటిస్తూ మౌనంగా ఉండిపోయారు. కేసీఆర్ పక్కన పడేసినవారు టిఆర్ఎస్‌లో ఇంకా చాలా మందే ఉన్నారు. వారిలో పద్మా దేవందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వంటివారు చాలా మందే ఉన్నారు. వారందరినీ బిజెపిలోకి రప్పించడానికి ప్రయత్నిస్తున్నట్లు భావించవచ్చు.