మునుగోడు ఉపఎన్నికల తర్వాత వెంకట్ రెడ్డిపై వేటు?

October 17, 2022


img

కాంగ్రెస్ పార్టీకి మునుగోడు ఉపఎన్నికలు అత్యంత కీలకమైనవి. ఆ ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలో చాలా బలహీనంగా కనిపిస్తోంది. కనుక ‘నల్గొండ నాకు కంచుకోట... జిల్లాలో అన్ని సీట్లను నేను ఒక్కడినే ఒంటి చేత్తో గెలిపించుకోగలను,’ అని ప్రగల్భాలు పలికే కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ సమయంలో తమ పార్టీ అభ్యర్ధిని గెలిపించుకొనే బాధ్యత తీసుకోవాలి. కానీ తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్నందున, రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో పనిచేయనని కుంటిసాకుతో ఈ ఉపఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఈరోజు గాంధీ భవన్‌లో తమ జాతీయ అధ్యక్ష ఎన్నికలలో ఓటు వేసేందుకు వచ్చిన ఆయన, మరోసారి పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని ఎద్దేవా చేస్తున్నట్లు మాట్లాడారు. 

గాంధీ భవన్‌ వద్ద మీడియాతో మాట్లాడుతూ, “నేను కేవలం హోంగార్డువంటివాడిని. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో గెలిపించుకొంటానని చెప్పిన రేవంత్‌ రెడ్డి జిల్లా ఎస్పీలాంటివారు. కనుక మునుగోడు ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఆయనే గెలిపించుకొంటారు,” అని అన్నారు. 

మునుగోడు ఉపఎన్నికలలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే దానికి రేవంత్‌ రెడ్డి ఎలాగూ నైతిక బాధ్యత వహించక తప్పదు. అప్పుడు ఆయన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రస్తావన చేయకుండా ఉండరు. తమ్ముడు పార్టీకి ద్రోహం చేసి బిజెపిలో చేరిపోతే, అన్న పార్టీలో ఉండి ఉపఎన్నికలలో పార్టీ అభ్యర్ధి పాల్వాయి స్రవంతిని గెలిపించుకొనే ప్రయత్నం చేయకుండా, ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండిపోయి తమ్ముడిని గెలిపించుకోవడానికి బిజెపికి సహకరించారని ఆరోపించడం ఖాయం. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బిజెపిలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకొని ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కనుక ఏదో ఓ రోజు బిజెపిలో చేరిపోవడం ఖాయమే. కనుక కాంగ్రెస్ పార్టీ ఆయనపై వేటు వేసి వదులుకొనేందుకు సాహసిస్తుందా లేదా? చూడాలి.


Related Post