టిఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ శనివారం పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను నేరుగా పార్టీ అధ్యక్షుడు, సిఎం కేసీఆర్‌కు పంపారు. ఆనాడు ఈటల రాజేందర్ పార్టీ నుంచి బహిష్కరింపబడి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పుడు సిఎం కేసీఆర్‌పై చేసినటువంటి ఆరోపణలే ఈరోజు బూర నర్సయ్య గౌడ్ కూడా చేయడం గమనార్హం. ఆయన తన రాజీనామా లేఖలో తనకు ఎంపీగా రెండుసార్లు అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుకొన్నాక, పార్టీ కోసం, ప్రభుత్వం కోసం తాను చేసిన కృషి గురించి చెప్పుకొన్నారు.
ఆ తర్వాత అసలు విషయానికి వస్తూ, గత లోక్‌సభ ఎన్నికలలో తన ఓటమికి పార్టీలో అంతర్గత కుట్ర కారణమని ఆరోపించారు. మునుగోడు టికెట్ ఆశించడం తప్పు కాదని కానీ అభ్యర్ధి ఎంపిక విషయంలో సిఎం కేసీఆర్ తనతో మాట మాత్రంగానైనా చర్చించలేదని బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు. లోక్‌సభ సభ్యుడిగా చేసిన తనకు మునుగోడు ఉపఎన్నికలలో పోటీ చేయడం ముఖ్యం కాదని, కానీ నియోజకవర్గం స్థాయి సమావేశాలకు, ఆత్మగౌరవ సభలకు కూడా తనను దూరంగా పెట్టడమే చాలా బాధ కలిగించిందని పేర్కొన్నారు.
పార్టీలో తనకు అవమానాలు జరుగుతున్నాయని తెలిసి ఉన్నప్పటికీ కేసీఆర్ ఎనాడూ పట్టించుకోలేదని, కనుక తనే ఆయనను కలవాలంటే దాదాపు అసాధ్యంగా మారిందని ఆరోపించారు. పార్టీలో ఎవరైనా కేసీఆర్‌ను కలవాలంటే దాని కోసం పెద్ద పోరాటమే చేయాల్సివస్తుందని అన్నారు. అయినప్పటికీ తాను కేసీఆర్ మీద గౌరవంతో మౌనంగా అవమానాలు భరిస్తూ ఇంతకాలం పార్టీలో కొనసాగానని, అయితే అభిమానానికి, బానిసత్వానికి చాలా తేడా ఉంటుందని బూర నర్సయ్య గౌడ్ తన లేఖలో పేర్కొనట్లు తెలుస్తోంది.
బూర నర్సయ్య గౌడ్ మునుగోడు టికెట్ లభించలేదనే కారణంతోనే టిఆర్ఎస్‌కు రాజీనామా చేసిన మాట వాస్తవం. పార్టీలో ఎవరికీ సిఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్ లభించదని, ఓసారి తాను ప్రగతి భవన్ గేటు వరకు వెళ్ళి వెనక్కు తిరిగివచ్చానని ఈటల రాజేందర్ చెప్పిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. బూర కూడా అవే ఆరోపణలు చేయడం టిఆర్ఎస్‌లో వాస్తవ పరిస్థితి అర్దం అవుతుంది. దేశంలో అన్ని ప్రాంతీయ పార్టీలను కలుపుకుపోయి జాతీయ రాజకీయాలలో రాణించాలనుకొంటున్న కేసీఆర్, సొంత పార్టీలో నేతలనే కలుపుకుపోలేకపోతున్నారా?అని బూర నర్సయ్య గౌడ్ తాజా ఆరోపణలతో సందేహం కలగడం సహజం.