మునుగోడులో పోస్టర్ల యుద్ధం: మేము మోసపోయాం... మీరూ మోసపోవద్దు!

October 15, 2022


img

రాజకీయాలలో ఉన్నవారు ముఖ్యంగా అధికారంలో ఉన్నవారు తమ ప్రత్యర్ధిని దెబ్బతీసేందుకు నైతిక విలువలను పక్కనపెడితే, ప్రత్యర్ధులు కూడా వారిని ఎదుర్కోవడానికి నీచరాజకీయాలు చేయకతప్పదు. చివరికి రాజకీయాలలో ఉన్న ఆ నాయకులందరికీ ఆ బురద అంటుకొంటుంది. ఇది అందరికీ తెలుసు. అయితే తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం ఆ బురద అంటించుకొనేందుకు సిద్దపడితే ఎవరు మాత్రం ఏం చేయగలరు?

మునుగోడు ఉపఎన్నికలలో ప్రస్తుతం ఇదే జరుగుతోంది. బిజెపిని దెబ్బ తీసేందుకు టిఆర్ఎస్‌ పోస్టర్ల యుద్ధం ప్రారంభించింది. “ఉపఎన్నికలలో బిజెపి అభ్యర్ధులను గెలిపించి మేము మోసపోయాము... మీరూ మోసపోవద్దు...” హుజురాబాద్‌, దుబ్బాక ప్రజలు హితవు పలుకుతున్నట్లు మునుగోడులో పోస్టర్లు వెలిశాయి. 

అంతకు ముందు “కాంట్రాక్ట్ పే పేరుతో బిజెపి అభ్యర్ధి ఫోటోతో రూ.18,000 కోట్ల కాంట్రాక్ట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేటాయించడం జరిగింది…” అంటూ ఓ పోస్టర్‌ ప్రత్యక్షమైంది. తాజాగా నిన్న రాత్రి కోవర్టు రెడ్డి అంటూ మరో పోస్టర్‌ వెలిసింది. ‘ 

వాటిని టిఆర్ఎస్సే పెట్టించిందని అర్దమవుతున్నప్పటికీ అందుకు సాక్ష్యం లేదు కనుక టిఆర్ఎస్‌ను ఎవరూ తప్పు పట్టలేరు. అయితే ఉపఎన్నికల కోసం టిఆర్ఎస్‌ ఇంతగా దిగజారిపోవలసిన అవసరం ఉందా?మునుగోడు ప్రజలకు ఏ పార్టీకి ఓట్లు వేయాలో తెలీనంత అజ్ఞానంలో ఉన్నారా?అంటే కాదనే అందరికీ తెలుసు. మరి ఎందుకు ఇలా చేస్తున్నారంటే... ప్రజలను ఈవిదంగా ప్రభావితం చేసి గెలిచేందుకే అని భావించవచ్చు. అయితే టిఆర్ఎస్‌కు మాత్రమే ఇటువంటి తెలివితేటలు ఉన్నాయి బిజెపికి లేవనుకొంటే అవివేకమే అవుతుంది. టిఆర్ఎస్‌ ఓ రాయి విసిరింది కనుక బిజెపి రెండు రాళ్ళు విసరకుండా ఉండదు. అంటే రెండు పార్టీలు రాళ్ళ దెబ్బలు తినక తప్పదన్న మాట! నైతిక విలువలను పక్కన పెడితే ఇదే జరుగుతుంది.                



Related Post