మునుగోడులో కాంగ్రెస్‌ ఓటమికి రాహుల్ గాంధీయే కారణం కానున్నారా?

October 14, 2022


img

కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు కానీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భారత్‌ జోడో అంటూ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తున్నారు. దానిలో భాగంగా ఈ నెల 23న తెలంగాణలోని మక్తల్ నియోజకవర్గంలో ప్రవేశించి రాష్ట్రంలో 16 అసెంబ్లీ నియోజకవర్గాలు, 8 లోక్‌సభ నియోజకవర్గాల గుండా 375 కిమీ పాదయాత్ర చేస్తారు. అయితే కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకమైన మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా సాగిపోతారు! 

అసలు ఆయన భారత్‌ని జోడిస్తానని కాళ్ళు అరిగిపోయేలా పాదయాత్ర చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవడానికే చేస్తున్నారని అందరికీ తెలుసు. కనుక తెలంగాణలో మునుగోడు ఉపఎన్నికలలో పార్టీని గెలిపించుకొనేందుకు వీలుగా తన పాదయాత్ర రూట్ మ్యాప్‌ను, తేదీలను సవరించుకొని ఉంటే ఆయన పాదయాత్రకు కాస్తంత అయినా ప్రయోజనం ఉండేది. కానీ సరిగ్గా ఉపఎన్నికలు జరుగుతున్న సమయంలోనే ఆయన తెలంగాణ అంతటా తిరిగి మునుగోడుకి వెళ్ళకపోవడం రాజకీయంగా అతి పెద్ద పొరపాటే! 

బిజెపి అభ్యర్ధిని గెలిపించుకోవడానికి అమిత్‌ షా, కేంద్రమంత్రులు, బిజెపి అగ్రనేతలు ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా మునుగోడుకి వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుంటే, నల్గొండ జిల్లా పక్క నుంచి వెళుతూ కూడా రాహుల్ గాంధీ మునుగోడులో తొంగి చూడకపోవడం పొరపాటు కాదా? 

నిజానికి తన నాయకత్వ లక్షణాలు నిరూపించుకోవడానికి రాహుల్ గాంధీకి మునుగోడు ఉపఎన్నికలు మరో గొప్ప అవకాశం కల్పించాయి. కనుక తెలంగాణలో కాళ్ళు అరిగేలా పాదయాత్ర చేసే బదులు ఉపఎన్నికల వరకు మునుగోడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొని తన పార్టీ అభ్యర్ధిని గెలిపించుకొని రాహుల్ గాంధీ ముందుకు సాగితే ఆ క్రెడిట్ ఆయనకే దక్కుతుంది కదా? 

రాహుల్ గాంధీ మునుగోడులో మకాం వేస్తే యావత్ కాంగ్రెస్‌ నేతలు కూడా తరలివస్తారు. యావత్ దేశం దృష్టి మునుగోడుపై పడుతుంది. దీంతో కాంగ్రెస్‌ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి విజయావకాశాలు గణనీయంగా పెరుగుతాయని వేరే చెప్పక్కరలేదు. 

కానీ మునుగోడులో అడుగు పెట్టకుండా వెళ్ళిపోతే, ఈ ఉపఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్ధి గెలిచే అవకాశం లేదని, ఆ ఓటమి అపకీర్తి తన ఖాతాలో జమా అవుతుందనే భయంతోనే రాహుల్ గాంధీ వెళ్లిపోతున్నారని బిజెపి, టిఆర్ఎస్‌లు ఎద్దేవా చేయకుండా ఉంటాయా? రాహుల్ గాంధీ ఇటువంటి క్లిష్ట సమయాలలో పార్టీని ముందుండి నడిపించకపోగా తప్పించుకొని పారిపోతుంటారు కనుకనే ఆయన నాయకత్వాన్ని పార్టీలో అందరూ ప్రశ్నిస్తుంటారు.

రాహుల్ గాంధీ తెలంగాణలో పాదయాత్ర చేయడం వలన కాంగ్రెస్ పార్టీకి మేలు చేయకపోగా మరింత నష్టం కలిగించబోతున్నారని చెప్పవచ్చు. ఏవిదంగా అంటే, మునుగోడు ఉపఎన్నికల ప్రచారం జోరుగా సాగవలసినవేళ రాహుల్ గాంధీ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తుండటంతో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలందరూ ఆ ఉపఎన్నికల ప్రచారాన్ని పక్కన పడేసి ఆయన వెనక నడవక తప్పదు. దాంతో మునుగోడులో పార్టీ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి కీలకమైన సమయంలో ఒంటరిగా మిగిలిపోతారు. ఆమె ఓటమికి రాహుల్ గాంధీ పాదయాత్రే కారణం అవుతుందని చెప్పక తప్పదు. 

ఆయన నవంబర్ 7వ తేదీన మహారాష్ట్రాలో ప్రవేశించనున్నారు. ఆయన తెలంగాణలో ఉండగానే మునుగోడు ఎన్నికల ఫలితాలు (నవంబర్ 6న) కూడా వచ్చేస్తాయి. కనుక పార్టీ ఓటమి కబురు కూడా విన్నాక చేతులు దులుపుకొని ముందుకు సాగిపోవచ్చు.   

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రాహుల్ గాంధీ అక్టోబర్‌ 31వ తేదీన హైదరాబాద్‌ చేరుకొని తన నానమ్మ, దివంగత ప్రధాని ఇందిరాగాంధీ వర్దంతి సందర్భంగా హైదరాబాద్‌లో ఛార్మినార్ నుండి పీవీఎన్‌ఆర్ మార్గ్ లోని ఆమె విగ్రహం వరకు పాదయాత్ర చేయనున్నారు. అంటే పార్టీకి కీలకమైన మునుగోడు ఉపఎన్నికల కంటే నానమ్మ వర్ధంతికి హాజరవడమే చాలా ముఖ్యమని రాహుల్ గాంధీ భావిస్తున్నారనుకోవలసి ఉంటుంది. 

కాంగ్రెస్‌ పార్టీకి ఏది ముఖ్యమో కూడా తెలుసుకోలేని ఇటువంటి నాయకుడు అవసరం లేదనే ఇప్పుడు వేరే నాయకుడిని ఎన్నుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్దం అవుతోంది. కనీసం వారైనా మునుగోడు వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొని తమ నాయకత్వ లక్షణాలను నిరూపించుకోగలరో లేదో?


Related Post