కేటీఆర్‌ మంచి మాటే చెప్పారు... ఫాలో అయిపోతే బెటరేమో?

October 13, 2022


img

ఈరోజు టిఆర్ఎస్‌ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్‌ వేశారు. అనంతరం మంత్రి కేటీఆర్‌ ఆయనకు మద్దతుగా చండూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. 

ఈ సందర్భంగా కేటీఆర్‌ మునుగోడు ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మీరు ఎమ్మెల్యేగా ఎన్నుకొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నాలుగేళ్ళలో ఎన్నిసార్లు మీ నియోజకవర్గానికి వచ్చారు? ఎన్నిసార్లు మిమ్మల్ని కలిసారు? మీ సమస్యలని ఒక్కటైనా పరిష్కరించారా?నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి చేశారా? అసలు తన కాంట్రాక్టుల గురించే తప్ప మునుగోడు గురించి ఆయన ఆలోచించింది ఎప్పుడు?ఇప్పుడూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.18,000 కాంట్రాక్ట్ కోసమే బిజెపిలో చేరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఈ ఉపఎన్నికలు తెచ్చిపెట్టారు. ఉపఎన్నికలలో డబ్బు వెదజల్లి మళ్ళీ గెలవగలననే అహంకారంతోనే తన పదవికి రాజీనామా చేశారు. కనుక ఇది ఓ కాంట్రాక్టర్ ధనమధానికి, ప్రజలకు మద్య జరుగుతున్న పోరు. 

ఈ నాలుగేళ్ళలో ఆయన నియోజకవర్గాన్ని పట్టించుకొకపోయినా సిఎం కేసీఆర్‌ మాత్రం మునుగోడు అభివృద్ధికి చేయగలిగినంతా చేస్తూనే ఉన్నారు. ఒకప్పుడు ఫ్లోరైడ్ పీడిత జిల్లాగా ఉన్న నల్గొండ జిల్లా గురించి దేశ ప్రధానులకు మొర పెట్టుకొన్నా పట్టించుకోలేదు. కానీ సిఎం కేసీఆర్‌ మిషన్ భగీరధ ద్వారా జిల్లాలోని ఫ్లోరైడ్ సమస్యను శాస్వితంగా పరిష్కరించారు. నాలుగేళ్ళుగా నియోజకవర్గం మొహం చూడని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మళ్ళీ మీరు ఓట్లేసి గెలిపిస్తే మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు కనబడరు. కనుక మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే టిఆర్ఎస్‌ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినే గెలిపించాలి. ఆయనను గెలిపిస్తే నేను మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నాను,” అని అన్నారు. 

మంత్రి కేటీఆర్‌ చెప్పింది అక్షరాల నిజమని మునుగోడు ప్రజలందరికీ తెలుసు. ఈ నాలుగేళ్ళలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆస్తులు సుమారు పది రెట్లు పెరిగి రూ.222 కోట్లు అయ్యాయి. కానీ మునుగోడు ప్రజలు జీవితాలు ఎలా ఉన్నవి అలాగే ఉండిపోయాయి. మునుగోడు ప్రజలు ఇదివరకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే తనకు టిఆర్ఎస్‌ ప్రభుత్వం సహకరించలేదని కనుక నియోజకవర్గం అభివృద్ధికి ఏమీ చేయలేకపోయానని స్వయంగా చెప్పుకొన్నారు. మరి అటువంటి వ్యక్తికి మళ్ళీ ఓట్లేసి గెలిపిస్తే ఏం ప్రయోజనం?

దుబ్బాక, హుజురాబాద్‌ ఉపఎన్నికలలో బిజెపి అభ్యర్ధులను గెలిపిస్తే వారు ఆ నియోజకవర్గాలకు ఏమి చేశారు?ఎప్పుడూ హైదరాబాద్‌లో కూర్చొని రాజకీయాలు, విమర్శలు చేస్తూ కాలక్షేపం చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కనుక ఇప్పుడూ వేరే పార్టీ అభ్యర్ధిని గెలిపించినా మునుగోడు పరిస్థితిలో ఎటువంటి మార్పు రాదు. 

ప్రస్తుతం రాష్ట్రంలో టిఆర్ఎస్‌ అధికారంలో ఉంది. వచ్చే ఏడాది చివరిలో మళ్ళీ శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. కనుక ఆ ఎన్నికలలో మళ్ళీ గెలిచేందుకైనా టిఆర్ఎస్‌ ప్రభుత్వం మునుగోడును అన్ని విదాలా అభివృద్ధి చేసి చూపుతుంది. తమను గెలిపిస్తే మునుగోడును దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని మంత్రి కేటీఆర్‌ హామీ ఇస్తున్నారు కూడా. కనుక ఆయనపై నమ్మకం ఉంచడమే మంచిదని చెప్పవచ్చు. 



Related Post