మునుగోడు ఉపఎన్నికలను బలవంతంగా తెచ్చిపెట్టిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇది ధర్మపోరాటం... మునుగోడు ప్రజలకి... కేసీఆర్ నిరంకుశత్వానికి మద్య జరుగుతున్న యుద్ధం అంటారు. తాను బిజెపిలో చేరితే ఇటువంటి సమస్య ఉత్పన్నం అవుతుందని కోమటిరెడ్డి సోదరులిద్దరికీ తెలుసు. అందుకే ఇంతకాలం రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరకుండా ఉగ్గబట్టుకొని కూర్చోన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం రూ.18,000 కోట్లు విలువైన కాంట్రాక్ట్ ఇవ్వడంతో రాజగోపాల్ రెడ్డి మరిక ఆలస్యం ఎందుకని బిజెపిలో చేరిపోయారని టిఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారు. రూ.18,000 కోట్ల కాంట్రాక్ట్ కోసం కాంగ్రెస్ పార్టీని మోసం చేసి బిజెపిలో చేరిపోయిన రాజగోపాల్ రెడ్డికి మునుగోడు ఓటర్లు మళ్ళీ ఎందుకు ఓట్లు వేయాలని టిఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
తమ్ముడు బిజెపిలో చేరి మునుగోడు ఉపఎన్నికలు తెచ్చిపెట్టాడు కనుక అన్న వెంకట్ రెడ్డి ముందే రేవంత్ రెడ్డిని నిందిస్తూ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ముందే తప్పించుకొన్నారు. తమ్ముడికి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం చేయడం బాగోదు... పైగా తన వలన తమ్ముడు ఓడిపోతే బందుత్వాలు కూడా దెబ్బ తింటాయి. అందుకే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏదో కుంటిసాకు చెప్పి తప్పించుకొని ఈ ఉపఎన్నికలకి దూరంగా ఉంటున్నారని అందరికీ తెలుసు.
అసలు ఈ ఇబ్బంది లేకుండా ఆయన ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలనుకొంటున్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఇంకా వెళ్ళలేదు కనుక ఆయనను టీవీ9 స్టూడియోకి ఆహ్వానించి మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ మొహం మీదనే ఇదే ప్రశ్న అడిగేశారు. దానికి ఆయన “ఒకవేళ ఈ ఎన్నికలలో మీ అక్క పోటీ చేస్తున్నట్లయితే మీరు ఎవరికి ఓటు వేస్తారు?” అని ఎదురు ప్రశ్నించారు.
అయితే రజనీకాంత్ కూడా ఇటువంటి దేశముదురు రాజకీయనాయకులను చాలమందినే చూశారు. కనుక “నేనైతే మా అక్కకే ఓటు వేస్తాను. మరి మీరు?” అని ఎదురు ప్రశ్నించేసరికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కంగుతిన్నారు. ఎందుకంటే అప్పుడు ఆయన కూడా “నేను నా తమ్ముడికే మద్దతు ఇస్తాను,” అని చెప్పాల్సి వస్తుంది. కనుక సమాధానం చెప్పకుండా డైవర్ట్ చేసేరు. అయితే రజనీకాంత్‌ని ఆయన అడిగిన ప్రశ్నలోనే నా తమ్ముడికే నా మద్దతు” అని మనసులో ఏముందో చెప్పకనే చెప్పేశారు.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కోసం తాను ఎన్నో త్యాగాలు చేశానని కనుక పార్టీ అధ్యక్ష పదవి తనకే ఇవ్వాలని గట్టిగా పట్టుబట్టిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ఉపఎన్నికలలో అండగా నిలబడకుండా తమ్ముడి కోసం దూరంగా ఉండిపోయారు. మరి ఆయనను కాంగ్రెస్ పార్టీ ఏవిదంగా నమ్మగలదు? కాంగ్రెస్ పార్టీ తమ్ముడిని నమ్మి మునుగోడు సీటు ఇస్తే ఆయన పార్టీని వీడి పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరిపోయారు. మళ్ళీ న్యాయం, ధర్మం అంటూ నీతి కబుర్లు చెపుతున్నారు. కనుక కోమటిరెడ్డి సోదరులు ఇద్దరూ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసినట్లే కదా?