సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ అంత్యక్రియలలో పాల్గొనేందుకు యూపీకి వెళ్ళిన తెలంగాణ సిఎం కేసీఆర్ అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ చేరుకొన్నారు. అక్కడే మరో 3-4 రోజులు ఉండబోతున్నట్లు సమాచారం. త్వరలో బిఆర్ఎస్ పార్టీతో జాతీయ రాజకీయాలలో ప్రవేశించబోతునందున, పార్టీ కార్యాలయం కోసం ఢిల్లీలోని సర్దార్ పటేల్ రోడ్డులో అద్దెకు తీసుకొన్న భవనాన్ని కేసీఆర్ మంగళవారం పరిశీలించి అవసరమైన మార్పులు చేర్పుల గురించి అధికారులకు తగు సూచనలు చేశారు.
ఢిల్లీలో వసంత విహార్‌లో పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ నిర్మాణం జరుగుతున్న సంగతి తెలిసిందే. సిఎం కేసీఆర్ నేడు ఆ భవనాన్ని కూడా పరిశీలించనున్నారు. నేటి నుంచి ఆయన ఢిల్లీలోని వివిద జాతీయ పార్టీ నేతలతో, రైతు సంఘాల నేతలతో, జాతీయ మీడియా ప్రతినిధులతో వరుస సమావేశాలు అవుతారు. ఈ సందర్భంగా ఆయన బిఆర్ఎస్ పార్టీ, జెండా, అజెండా గురించి వారికి వివరించి అందరి సహకారం కోరనున్నారు. కనుక బిఆర్ఎస్‌పై జాతీయ మీడియా ఏవిదంగా స్పందిస్తుందో చూడాలి.
అయితే కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మునుగోడు ఉపఎన్నికలు జరుగబోతుంటే సిఎం కేసీఆర్ తన కుమార్తె కల్వకుంట్ల కవితను వెంటబెట్టుకొని ఢిల్లీలో 3-4 రోజులు మకాం వేయడంపై రాష్ట్రంలో బిజెపి, కాంగ్రెస్ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అభిషేక్ రావును సీబీఐ పోలీసులు అరెస్ట్ చేయడంతో తర్వాత తన కుమార్తెకు నోటీసులు పంపబోతున్నారని గ్రహించే సిఎం కేసీఆర్ కూతురుని వెంటబెట్టుకొని ఢిల్లీలో కూర్చొని లాబీయింగ్ చేస్తున్నారని కాంగ్రెస్, బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు.
సిఎం కేసీఆర్‌తో పాటు కల్వకుంట్ల కవిత, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీలు సంతోష్ కుమార్,బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు ఉన్నారు.