మునుగోడు ఉపఎన్నికలతో నియోజకవర్గానికి, దానిలో ప్రజలకు ఏం ఒరుగుతుందో తెలీదు కానీ అభ్యర్ధుల ఎంత ధనవంతులో మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది! ఈ ఉపఎన్నికలను తెచ్చిపెట్టిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి అభ్యర్ధిగా నిన్న చండూరు తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. ఎన్నికల నిబందనల ప్రకారం దానితో బాటు తనవి, భార్య లక్ష్మీవి స్థిర, చర ఆస్తుల వివరాలను అఫిడవిట్‌లో పేర్కొన్నారు. దాని ప్రకారం వారి ఆస్తుల మొత్తం విలువ రూ.222.66 కోట్లు!
2018 శాసనసభ ఎన్నికలప్పుడు ఆయన సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తుల విలువ రూ.24.55 కోట్లు, తన భార్య లక్ష్మి స్థిర, చర ఆస్తులు కలిపి రూ.289.75 కోట్లు ఉండేవని పేర్కొన్నారు. అంటే అప్పుడు ఇద్దరి ఆస్తులు కలిపి రూ. 314.30 కోట్లు కాగా అవిప్పుడు రూ.222.66 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నందున వారి ఆస్తులలో రూ.38 కోట్లు తగ్గినట్లు అఫిడవిట్‌లో చూపారు.
రాజగోపాల్ రెడ్డి దంపతుల ఆస్తులలో ఆయన భార్య లక్ష్మి పేరిట రూ.52.44 కోట్ల విలువగల స్థిర, చరాస్తులు ఉన్నట్లు తాజా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన వద్ద కేవలం రూ.7.96 లక్షల నగదు, తన భార్య వద్ద రూ.2.37 లక్షల నగదు మాత్రమే ఉందని తెలిపారు.
తన వద్ద ఒక కేజీ బంగారం, తన భార్య వద్ద 4 కేజీల బంగారం, 20 కేజీల వెండి, 30 క్యారెట్ల వజ్రాలు కలిపి మొత్తం రూ.3.89 కోట్లు విలువైన ఆభరణాలు ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
ఈ వివరాలతో పాటు అప్పుల వివరాలు కూడా ఆయన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. వివిద బ్యాంకులు, ప్రైవేట్ వ్యక్తులకు రూ.65.41 కోట్లు అప్పులు చెల్లించాల్సి ఉందని తెలిపారు.
ఇక కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న పాల్వాయి స్రవంతి కూడా సోమవారం నామినేషన్ వేశారు. ఆమె సమర్పించిన అఫిడవిట్‌లో తన స్థిర, చర ఆస్తులు కలిపి రూ. 24.69 కోట్లు అని పేర్కొన్నారు. వాటిలో చరాస్తులు అంటే బంగారం, వెండి ఆభరణాలు, కార్లు వగైరాలు కలిపి రూ.65.23 లక్షలని, మిగిలినవి స్థిరాస్తులని పేర్కొన్నారు. ప్రస్తుతం చేతిలో కేవలం రూ.36,000 నగదు ఉందని, కారు లోన్ రూ.6 లక్షలు చెల్లించవలసి ఉందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
ఏ అభ్యర్ధులు తమ అఫిడవిట్‌లో తమ వాస్తవ ఆస్తుల విలువను ప్రకటించరనేది బహిరంగ రహస్యం. ఓ ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తులే రూ. 222.66 కోట్లు ఉంటే, అధికార పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఆస్తులు ఇంకెంత ఉంటాయో ఎవరూ ఊహించలేరు.
అభ్యర్ధులు అఫిడవిట్‌లో చూపుతున్న ఆస్తులే ఇంత ఉంటే, వాస్తవంగా ఇంకెన్ని రెట్లు ఉంటాయో కూడా ఎవరూ ఊహించలేరు. దేశంలో మరే వ్యాపారంలోను ఇంత తక్కువ కాలంలో ఇన్ని వందలు, వేల కోట్లు సంపాదించలేరు కనుకనే అందరూ రాజకీయాలలోకి చొరబడుతున్నట్లు భావించవచ్చు. రాజకీయాలలో నాయకులు బాగుపడుతున్నారు కానీ దేశం, రాష్ట్రం, ప్రజల పరిస్థితి మాత్రం నానాటికీ పెరుగుతున్న ధరలతో దయనీయంగా మారుతూనే ఉంది.