ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ప్రధాన నిందితులలో ఒకరిగా భావిస్తున్న హైదరాబాద్‌కు చెందిన బోయినపల్లి అభిషేక్ రావును సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడంతో తర్వాత కల్వకుంట్ల కవితకు నోటీసు జారీ చేయవచ్చనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ లిక్కర్ స్కామ్‌తో తనకు ఎటువంటి సంబందమూ లేదని ఆమె ఖండించినప్పటికీ, అభిషేక్ రావుతో ఆమెకు వ్యాపార సంబంధాలున్న మాట నిజమైతే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో ఆమెకు సంబందం ఉండవచ్చు.
ఇక నవంబర్ 3న మునుగోడు ఉపఎన్నికలు జరుగబోతున్నాయి. అవి అటు టిఆర్ఎస్‌కి, ఇటు బిజెపికి చాలా కీలకమైనవి. కనుక ఆలోపుగానే సీబీఐ లేదా ఈడీ అధికారులు కల్వకుంట్ల కవితకు నోటీసులు జారీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సిఎం కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీతో జాతీయ రాజకీయాలలో ప్రవేశించి ప్రధాని నరేంద్రమోడీని గద్దె దింపుతానని పదేపదే సవాలు చేస్తుండటం, ప్రధాని మోడీ అసమర్దుడని పదేపదే విమర్శిస్తుండటంతో ఆయనను కవ్విస్తున్నట్లవుతోంది. కనుక కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో కేసీఆర్‌ను కట్టడి చేయాలని ప్రయత్నిస్తున్నట్లు భావించవచ్చు. కనుక ఈ కుంభకోణంలో ఆర్ధిక, అవినీతి అంశాలతో పాటు రాజకీయ అంశాలు కూడా మిళితమై ఉన్నాయని స్పష్టం అవుతోంది.
ఒకవేళ మునుగోడు ఉపఎన్నికలకు ముందే కల్వకుంట్ల కవితకు ఈ కేసులో నోటీసు జారీ చేసినట్లయితే టిఆర్ఎస్ దానితో సానుభూతి, సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేయవచ్చు. అదేవిదంగా బిజెపి దానిని అవినీతి అస్త్రంగా మలుచుకొని టిఆర్ఎస్‌పై ప్రయోగించి ఉపఎన్నికలలో లబ్దిపొందేందుకు గట్టిగా ప్రయత్నించవచ్చు. కనుక ఉపఎన్నికలకు ముందు కల్వకుంట్ల కవితకు నోటీసు ఇస్తారా లేక తర్వాత ఇస్తారా?ఇస్తే దానిని రెండు పార్టీలలో ఏది అనుకూలంగా మలుచుకొని ప్రత్యర్ధిపై పైచేయి సాధిస్తుంది? అనే ప్రశ్నలకు అతి త్వరలోనే సమాధానాలు లభిస్తాయి.