మునుగోడు ఉపఎన్నికలు ఎందుకు వచ్చాయో మూడు పార్టీలు మూడు భిన్నమైన వాదనలు చేస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేంద్రం ఇచ్చిన రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు కోసమే బిజెపిలో ఉపఎన్నికలు తెచ్చిపెట్టాడని టిఆర్ఎస్ వాదన. కేసీఆర్ నియంతృత్వ ప్రజావ్యతిరేక పోకడలకి మునుగోడు ప్రజలకి మద్య జరుగుతున్న ఎన్నికలని రాజగోపాల్ రెడ్డి వాదన. కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీసేందుకే రెండు పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా మునుగోడు ఉపఎన్నికలని రేవంత్ రెడ్డి వాదన
కానీ ఈ ఉపఎన్నికలు టిఆర్ఎస్, బిజెపిల మద్య జరుగుతున్న రాజకీయ ఆధిపత్యపోరులో భాగంగా వచ్చాయని అందరికీ తెలుసు. కనుక ఈ ఉపఎన్నికలలో విజయం సాధించడానికి రెండు పార్టీలు పోటాపోటీగా ఓటర్లకు డబ్బు పంచుతూ, మద్యం ఏరులుగా పారించేందుకు వెనకాడటం లేదు. మంత్రి మల్లారెడ్డి స్వయంగా నియోజకవర్గంలో కొందరు కులపెద్దలకు మద్యం పోస్తున్న ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలోకి రావడమే ఇందుకు నిదర్శనం. కానీ మంత్రి కేటీఆర్ మాత్రం ఇవి ధనబలానికి ప్రజాబలానికి మద్య జరుగుతున్న ఎన్నికలని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధనదాహం కొరకే ఈ ఉపఎన్నికలను తెచ్చిపెట్టాడని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఆయన గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మునుగోడు ప్రజలకు ఇచ్చిన హామీలనే ఇంతవరకు నెరవేర్చకుండా మళ్ళీ కొత్త హామీలతో ప్రజల ముందుకు వచ్చారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి టిఆర్ఎస్‌తోనే సాధ్యం అని అన్నారు.
మీడియా ముందు ఎవరు ఎన్ని నీతులు చెప్పినప్పటికీ ఈ ఉపఎన్నికలను శాశించేది ధనబలమే అని అందరికీ తెలుసు. ఇందుకు టిఆర్ఎస్‌తో సహా ఏ పార్టీ కూడా అతీతం కాదు. కానీ ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లు పార్టీల, అభ్యర్ధుల ఆర్ధికశక్తి మేరకు డబ్బు ఖర్చు పెడుతుంటారు అంతే! కనుక ఈ ఉపఎన్నికలో గెలిచేది, గెలిపించేది డబ్బు మాత్రమే. ఎవరు ఎక్కువగా ఖర్చు పెట్టారో వారే విజేత. ఆ విజేత ఎవరో నవంబర్ 6వ తేదీన ఫలితాలు వెలువడినప్పుడు తెలుస్తుంది.