ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో సీబీఐ అధికారులు వేగం పెంచారు. ఈ కేసులో ప్రధాన నిందితులలో ఒకరిగా భావిస్తున్న హైదరాబాద్‌కు చెందిన అభిషేక్ రావు బోయినపల్లిని అరెస్ట్ చేసినట్లు సీబీఐ అధికారులు దృవీకరించారు. నేడు అతనిని సీబీఐ కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ఈ కేసులో ఇదివరకు సమీర్ మహేంద్ర అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
మరోపక్క ఈడీ అధికారులు కూడా పలుమార్లు హైదరాబాద్‌లో ఈ కేసుతో సంబందం ఉందన్నట్లు భావిస్తున్న పలువురి ఇళ్ళు, కార్యాలయాలలో సోదాలు నిర్వహించారు. ఈ కేసులో సిఎం కేసీఆర్ కుమార్తె, టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు కూడా వినబడినందున ఈ కేసు దర్యాప్తు అంతిమ లక్ష్యం కేసీఆర్ కుటుంబమే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈడీ, సీబీఐ అధికారులు ఇంతవరకు ఆమె జోలికి వెళ్లలేదు కానీ కేసీఆర్ కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేస్తూ వారు ఒత్తిడికి గురయ్యేలా చేయడం కొరకే ఈడీ అధికారులు పదేపదే హైదరాబాద్‌లో సోదాలు నిర్వహిస్తున్నారనే వాదనలు కూడా వినబడుతున్నాయి. బహుశః అందుకేనేమో మంత్రి కేటీఆర్ ఇటీవల “ఏదోరోజు ఈడీ, సీబీఐ మా ఇళ్ళపైకి వచ్చినా ఆశ్చర్యం లేదు,” అని అన్నారు.
ఈ కేసుతో బిజెపి (కేంద్ర ప్రభుత్వం) ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలని ప్రయత్నిస్తున్నట్లు అర్దమవుతోంది. అక్కడ ఢిల్లీలో ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, ఆమాద్మీ పార్టీలు, ఇక్కడ తెలంగాణలో కొరకరాని కొయ్యగా మారిన కేసీఆర్, టిఆర్ఎస్ పార్టీలను దీంతో రాజకీయంగా దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. కనుక ఈ లిక్కర్ స్కామ్‌లో దోషులకు శిక్షలు పడతాయా లేదా?అని కాకుండా బిజెపికి టిఆర్ఎస్, ఆమాద్మీ పార్టీల మద్య జరుగుతున్న ఈ రాజకీయ చదరంగంలో చివరికి ఏ పార్టీ పైచేయి సాధిస్తుంది? అనే అందరూ ఎదురుచూస్తున్నారు.