మునుగోడు ఉపఎన్నికలలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) కూడా బరిలో దిగుతుందని ఆ పార్టీ కన్వీనర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఇదివరకే ప్రకటించారు. ఈరోజు సాయంత్రం ఆందోజు శంకరాచారిని తమ పార్టీ అభ్యర్ధిగా ప్రకటించారు. పోలీస్ అధికారిగా పనిచేసిన ప్రవీణ్ కుమార్ ఇంకా ఆరేళ్ళుపైగా సర్వీసు ఉండగానే తన పదవికి రాజీనామా చేసి బీఎస్పీలో చేరిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాల ప్రజలను ఒక్క తాటిపైకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ అనేక సభలు, సమావేశాలు నిర్వహించారు.
రాష్ట్రంలో మెజార్టీ శాతం బడుగు బలహీనవర్గాలే ఉన్నప్పటికీ జనాభా ప్రతిపదికన మనకు రాజ్యాధికారంలో భాగం లభించడంలేదని కనుక మన హక్కులు, అధికారాల కోసం మనమే కలిసికట్టుగా పొరాడి సాధించుకోవాలని అందరికీ నచ్చజెపుతున్నారు. అందరం కలిసికట్టుగా ఉంటే వచ్చే ఎన్నికలలో మనమే రాష్ట్రంలో అధికారంలోకి రాగలమని గట్టిగా వాదిస్తున్నారు. ఆయన వాదనలను నిరూపించుకొనేందుకు మునుగోడు ఉపఎన్నికలతో తొలి అవకాశం లభించింది.
మునుగోడు ఉపఎన్నికలలో టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు మూడు కూడా రెడ్డి సామాజికవర్గానికి చెందిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పాల్వాయి స్రవంతిలను అభ్యర్ధులుగా నిలిపాయి. కనుక ఇది ప్రవీణ్ కుమార్‌కు కలిసి వచ్చే అంశమేయని చెప్పవచ్చు.
మునుగోడులో బడుగు బలహీనవర్గాల ఓటర్లు తమ వర్గానికే చెందిన ఆందోజు శంకరాచారికి అండగా నిలబడి గెలిపించుకొంటారా లేక ఎన్నికల వరాలు, ప్రలోబాలకు లొంగి రెడ్డి సామాజికవర్గానికే ఓట్లు వేస్తారా? అనేది ప్రవీణ్ కుమార్ కూడా తెలుసుకొనే అవకాశం లభించింది. ఒకవేళ ఈ ఉపఎన్నికలలో ఆయన బీఎస్పీ అభ్యర్ధిని గెలిపించుకోగలిగితే అది మూడు ప్రధాన పార్టీలకు తొలి హెచ్కరిక వంటిదవుతుంది. లేకుంటే ప్రవీణ్ కుమార్ వచ్చే ఎన్నికలలోగా తన పార్టీ విధానాలను, వ్యూహాలను సమూలంగా మార్చుకొనే ప్రయత్నం చేయవలసి ఉంటుంది.