బిజెపి సూచన మేరకే షర్మిల సీబీఐకి ఫిర్యాదు చేశారా?

October 08, 2022


img

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మొన్న ఢిల్లీ వెళ్ళి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతికి పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. కనుక కేసీఆర్‌ కుటుంబం అవినీతిపై దర్యాప్తు చేయాలని ఆమె సీబీఐని కోరారు. 

ఆమె హటాత్తుగా ఢిల్లీ వెళ్ళి సిఎం కేసీఆర్‌పై సీబీఐకి ఫిర్యాదు చేయడం, అందుకు ఆమె ఎంచుకొన్న సమయం రెండూ కూడా అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. త్వరలోనే మునుగోడు ఉపఎన్నికలు జరుగబోతున్నాయి. హుజురాబాద్‌ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ ఓటమిని కేసీఆర్‌ ఓటమిగా పరిగణింపబడుతున్నందున, ఈ ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ను గెలిపించుకోవడం ద్వారా బిజెపిపై ప్రతీకారం తీర్చుకోవాలని సిఎం కేసీఆర్‌ చాలా పట్టుదలగా ఉన్నారు. 

సరిగ్గా ఈ సమయంలో ఆమె బిజెపికి మద్దతుగా ఉపఎన్నికల బరిలో నుంచి తప్పుకొన్నట్లు ప్రకటించడం, హడావుడిగా ఢిల్లీ వెళ్ళి సిఎం కేసీఆర్‌పై సీబీఐకి ఫిర్యాదు చేయడం చూస్తే ఆమె బిజెపి సూచన మేరకే చేసి ఉండవచ్చనే అనుమానం కలుగుతోంది. కేసీఆర్‌ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడుతున్నా కేంద్ర ప్రభుత్వం ఆయన ప్రభుత్వంపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు కనుకనే తాను నేరుగా సీబీఐకి ఫిర్యాదు చేయవలసి వచ్చిందని ఆమె సర్ధి చెప్పుకొన్నప్పటికీ బిజెపి సూచన మేరకే సీబీఐకి ఫిర్యాదు చేసి ఉండవచ్చు. 

అదే... బిజెపి నేతలు ఫిర్యాదు మేరకు లేదా కేంద్రం ఆదేశం మేరకు సీబీఐ దర్యాప్తు మొదలుపెట్టినా, కేసీఆర్‌పై ప్రజలలో సానుభూతి ఏర్పడి ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌కు లబ్ది కలగవచ్చు. కనుక వైఎస్ షర్మిల ద్వారా ఫిర్యాదు చేయించి సీబీఐని రంగంలో దింపేందుకు కేంద్రం సిద్దం అవుతోందేమో?అనే సందేహం కలుగుతోంది. అయితే ఎవరి ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు చేపట్టినప్పటికీ కేసీఆర్‌పై ప్రజలలో సానుభూతి, సెంటిమెంట్ ఏర్పడే అవకాశం ఉంటుంది. 

వైఎస్ షర్మిల బిజెపివైపు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టం అవుతూనే ఉంది. తాను ఎంత ప్రయత్నించినా తెలంగాణలో తన పార్టీకి ప్రజాధారణ లభించదనే విషయం ఆమె గ్రహించే ఉంటారు. కనుక తెలంగాణలో ఇంకా ఒంటరి పోరాటం చేయడం కంటే బిజెపికి అనుకూలంగా వ్యవహరించడమే మేలని భావిస్తున్నారేమో?

అయితే ఆమె తెలంగాణలో పెడుతున్న కష్టం, ఖర్చు ఆంధ్రప్రదేశ్‌లో పెడితే కొంతైనా ఫలితం లభించి ఉండేదేమో?కానీ అక్కడ ప్రస్తుతం ఆమె సోదరుడు జగనన్న సంక్షేమ రాజ్యం సాగుతోంది కనుక అక్కడ అడుగుపెడితే ఇద్దరికీ ఇబ్బందికరంగా మారుతుంది. కానీ భవిష్యత్‌లో జగన్ దిగిపోతే, గతంలో రాష్ట్రం విడిపోయినప్పుడు ఆయన తట్టాబుట్టా సర్ధుకొని ఏపీకి వెళ్ళిపోయినట్లే వైఎస్ షర్మిల కూడా వెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదు.


Related Post