దసరా పండుగనాడు హైదరాబాద్‌లో జరిగిన ఆలాయ్-బలాయ్ కార్యక్రమంలో ప్రముఖ ప్రవచకులు, అవధాని, మహా పండితులు గరికపాటి నరసింహరావు మెగాస్టార్ చిరంజీవిపై కాస్త ఆగ్రహం వ్యక్తం చేసినందుకు, నాగబాబుతో సహా మెగా అభిమానులందరూ ఆయనపై విరుచుకుపడుతున్నారు.
అయితే ఆయన ఆగ్రహాన్ని అర్దం చేసుకొన్న చిరంజీవి వెంటనే ఆయనకు క్షమాపణ చెప్పి ఆ తర్వాత ఆయన ప్రవచనాన్ని శ్రద్దగా ఆలకించారు. వీలుచూసుకొని ఓ సారి తన ఇంటికి భోజనానికి రావలసిందిగా ఆయనను ఆహ్వానించారు కూడా. చిరంజీవి సవినయంగా స్పందించడం చూసి ఆయన కూడా వెనక్కు తగ్గి ‘నేను ఆవిదంగా అని ఉండాల్సింది కాదంటూ..’ చిరంజీవికి క్షమాపణ చెప్పుకొన్నారు.
అయినా మెగా అభిమానులు, నెటిజన్స్ సోషల్ మీడియాలో గరికపాటిని ట్రోల్ చేస్తూనే ఉన్నారు. నాగబాబు కూడా గరికపాటి పేరు ప్రస్తావించకుండా “ఏపాటివాడికైనా చిరంజీవిగారి ఇమేజ్ చూస్తే ఆపాటి అసూయపడటం పరిపాటే...” అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. చిరంజీవి ఇమేజ్ చూసి గరికపాటి అసూయ పడుతున్నారని ఆయన చెప్పకనే చెప్పారు.
సినీరంగంలో చిరంజీవి ఏవిదంగా పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నారో, గరికపాటివారు కూడా తన రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నారనే సంగతి అందరికీ తెలుసు. అటువంటి వ్యక్తి చిరంజీవిని చూసి అసూయపడాల్సిన అవసరం ఏమిటి?వేదికపై తన కార్యక్రమం మొదలైనప్పుడు చిరంజీవి ఫోటో సెషన్ కొనసాగిస్తుండటంతో ఆయన కాస్త అసహనం వ్యక్తం చేశారు అంతే! ఒకవేళ చిరంజీవి కార్యక్రమంలో వేరెవరైనా ఆవిదంగా చేస్తుంటే చిరంజీవి కూడా వారించేవారు కదా?కనుక గరికపాటి ఆగ్రహాన్ని అసూయగా భావించడం సరికాదు.
తెలుగుజాతి గర్వపడే అటువంటి పెద్దాయనని చిరంజీవే గౌరవిస్తున్నప్పుడు ఆయన తమ్ముడు నాగబాబు, అభిమానులు ఆయనని ట్రోల్ చేయడం సరికాదనే చెప్పాలి. తద్వారా ఆయనను మానసికవేదన అనుభవించేలా చేయవచ్చునేమో కానీ చిరంజీవికి చెడ్డ పేరు తెస్తున్నామనే విషయం మరిచిపోకూడదు.
నాగబాబు కూడా ఇది గ్రహించినట్లే ఉన్నారు కానీ నేటికీ ఆయన తన సోదరుడు చిరంజీవిలా హుందాగా వ్యవహరించలేకపోతున్నారనే చెప్పవచ్చు. మళ్ళీ వ్యంగ్యంగా, “గరికపాటివారు ఏదో మూడ్‌లో అలా అని ఉంటారు. ఆయనలాంటి పండితుడు అలా అని ఉండకూడదని... ఆయన అర్దం చేసుకోవాలని అని అన్నామే తప్ప, ఆయనతో క్షమాపణ చెప్పించుకోవాలని మాకు కోరిక లేదు. ఏది ఏమైనా మన మెగా అభిమానులు ఆయనని అర్దం చేసుకోవాలి గానీ ఎవరూ తప్పుగా మాట్లాడవద్దని మెగాభిమానులకు నా విజ్ఞప్తి,” అని మరో ట్వీట్ చేశారు.