వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు బిజెపివైపు అడుగులు వేస్తున్నారా?అంటే అవుననే అనిపిస్తోంది. “వచ్చే ఎన్నికలలో మా పార్టీయే గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది కావాలంటే రాసి పెట్టుకోండని” చెప్పి రాష్ట్రంలో ప్రజాప్రస్థానం పేరుతో వైఎస్ షర్మిల పాదయాత్ర చేస్తున్నారు. దాంతో ఆమెకు కాళ్ళ నొప్పులు తప్ప మరేమీ ప్రయోజనం కనబడలేదు. ఆమెను ప్రజలు పట్టించుకోవడం లేదు... రాష్ట్రంలో రాజకీయ పార్టీలు కూడా పట్టించుకోవడం లేదు.
మంత్రి నిరంజన్ రెడ్డితో మాటల యుద్ధం చేస్తే టిఆర్ఎస్ నేతలు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఆమెపై ఫిర్యాదు చేశారు కానీ ఆమెపై చర్యలు తీసుకొంటే ఆమెకు గుర్తింపు కల్పించినట్లవుతుందనుకొన్నారో ఏమో ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. “దమ్ముంటే నాపై చర్యలు తీసుకోవాలి... నన్ను అరెస్ట్ చేయాలంటూ…” ఆమె సవాళ్ళు విసురుతూ టిఆర్ఎస్‌ను రెచ్చగొట్టేందుకు విశ్వప్రయత్నాలు చేశారు కానీ టిఆర్ఎస్ వాటిని పట్టించుకోలేదు.
దీంతో ఆమెకు ఏం చేయాలో పాలుపోక కేసీఆర్ కుటుంబం అవినీతిపై ఢిల్లీ పెద్దలకు, సీబీఐకి ఫిర్యాదు చేయడానికి గురువారం ఢిల్లీ వెళ్ళారని సమాచారం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మునుగోడు ఉపఎన్నికలలో పార్టీ అభ్యర్ధిని నిలబెట్టకూడదని, బిజెపి అభ్యర్ధిగా బరిలో దిగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతు తెలపాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఇప్పుడు ఈ రెండు వార్తలను కలిపి చూస్తే ఆమె బిజెపికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు అర్దమవుతుంది. ఆమె ఒంటరిగా ఎంతకాలం పోరాడినా టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలను ఢీకొని గెలవలేరు కనుక టిఆర్ఎస్‌ను బలంగా ఢీకొంటున్న బిజెపితో చేతులు కలిపితే మంచిదని భావిస్తున్నట్లు సమాచారం. అయితే హిందుత్వ అజెండా కలిగిన బిజెపితో ఆమె కలిసి పనిచేయగలరా? బిజెపి ఆమె పార్టీతో పొత్తులకు ఆసక్తి చూపుతుందా?అనే ప్రశ్నలకు రాబోయే రోజుల్లో తప్పక సమాధానాలు తప్పక లభిస్తాయి.