టిఆర్ఎస్ బిఆర్ఎస్ జాతీయపార్టీగా మారిన తర్వాత ముందుగా కర్ణాటక, మహారాష్ట్రాలలోనే మన పార్టీ పోటీ చేయబోతోందని సిఎం కేసీఆర్ నిన్న ప్రకటించారు. అక్కడి రైతుల, ప్రజల సమస్యలు తీర్చడం గురించి కేసీఆర్ చెప్పిన మాటలను పక్కనపెడితే, ఆ రెండు రాష్ట్రాలలోనే బిఆర్ఎస్‌కు రాజకీయంగా చాలా అనుకూలవాతావరణం ఉందని చెప్పవచ్చు.
ఆ రెండు రాష్ట్రాలలో బిజెపి అధికారంలో ఉంది. కర్నాటకలో జనతాదళ్ సెక్యులర్, మహారాష్ట్రలో శివసేనపార్టీలు బిజెపికి బలమైన ప్రత్యామ్నాయంగా నిలబడ్డాయి. బిజెపి ఆడిన రాజకీయ చదరంగంలో ఆ రెండు పార్టీలు అధికారం కోల్పోయి ప్రతీకారం తీర్చుకొనేందుకు ఎదురుచూస్తున్నాయి. శత్రువుకి శత్రువు మిత్రుడవుతాడు కనుక సిఎం కేసీఆర్ వాటి అధినేతలతో స్నేహం చేశారు. కనుక ఆ రెండు పార్టీలు కూడా తమతమ రాష్ట్రాలలో బిఆర్ఎస్‌తో కలిసి పనిచేయడానికి సిద్దంగా ఉన్నాయి. బిజెపిని దెబ్బ తీసి మళ్ళీ అధికారం చేజిక్కించుకొనేందుకు బిఆర్ఎస్‌కు కొన్ని సీట్లు కేటాయించి ఆ స్థానాలలో దానిని గెలిపించడానికి అవి సిద్దంగా ఉన్నాయి.
అలాగే అత్యంత ధనిక పార్టీ అయిన బిఆర్ఎస్ మహారాష్ట్రలో శివసేన, కర్నాటకలో జనతాదళ్ (యు)లను అధికారంలోకి తీసుకురావడానికి అన్ని రకాలుగా సాయపడగలదు. అందుకు ప్రతిగా ఆ రెండు పార్టీలు తమ రాష్ట్రాలలో బిఆర్ఎస్‌ను గెలిపించేందుకు పూర్తి సహకారం అందిస్తాయి. భవిష్యత్‌లో బిజెపిని ఓడించేందుకు బిఆర్ఎస్‌కు అవి అన్నివిదాలా సహకరిస్తాయి.
ఈవిదంగా ఆ రెండు రాష్ట్రాలలో బిఆర్ఎస్ వాటితో కలిసి పోటీ చేసి గెలిచినట్లయితే జాతీయపార్టీగా గుర్తింపు లభిస్తుంది. జాతీయ రాజకీయాలలో కేసీఆర్‌కు మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. ఇలాగే దేశంలో ఇతర రాష్ట్రాలలో కూడా బిజెపి బాధితపార్టీలతో కలిసి పనిచేసి సత్ఫలితాలుసాధించగలిగితే, అప్పుడు దేశంలోని మిగిలిన బిజెపియేతర పార్టీలన్నీ కూడా కేసీఆర్ నాయకత్వం కింద పనిచేయడానికి అంగీకరిస్తాయి. అప్పుడు సార్వత్రిక ఎన్నికలలో బిజెపిని, మోడీ, అమిత్ షాలను ఢీకొట్టగలుగుతారు.
అయితే కాంగ్రెస్‌ను కలుపుకోకుండా ముందుకు వెళ్ళడం సాధ్యమా కాదా?కేంద్రంలో బిజెపిని గద్దె దించేందుకు, అన్ని పార్టీలని తన నాయకత్వం కింద ఒక్క తాటిపైకి తెచ్చేందుకు కేసీఆర్ కాంగ్రెస్‌తో దోస్తీకి సిద్దపడతారా లేదా? కేసీఆర్ నాయకత్వాన్ని, ఆయనను ప్రధానిగా ఉత్తరాది పార్టీలు అంగీకరిస్తాయా లేదా?అన్నీ కలిసి బిజెపిని ఓడించి గద్దె దించగలవా లేవా? అనే ప్రశ్నలన్నిటికీ భవిష్యత్‌లో సమాధానాలు దొరుకుతాయి. కానీ బిఆర్ఎస్ విస్తరణకు కర్ణాటక, మహారాష్ట్రలను కేసీఆర్ ఎంచుకోవడం మాత్రం చాలా తెలివైన నిర్ణయమని చెప్పవచ్చు. అంటే జాతీయ రాజకీయాలలో కేసీఆర్ తొలి అడుగు సరైన దిశలో వేశారని భావించవచ్చు.