మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధానపాత్రలలో రూపొందిన గాడ్ ఫాదర్ చిత్రం అక్టోబర్ 5వ తేదీన విడుదల కాబోతోంది. కనుక మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా చిరంజీవి పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ తన మనసులో ఆలోచనలను అభిమానులతో పంచుకొంటున్నారు. శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “గతంలో హిట్ వస్తే చాలా సంతోషించేవాడిని.. ఫ్లాప్ అయితే బాధపడేవాడిని. మొదటి 15 ఏళ్ళలోనే ఆ దశను దాటగలిగాను. నటుడిగా జయాపజయాలను మనసులో తీసుకోకుండా పనిచేస్తున్నాను. కనుక ఇప్పుడు అంత బాధపడటం లేదు. ఆచార్య విషయానికి వస్తే మేము మా బెస్ట్ ఇచ్చాము. ఆ సినిమాలో దర్శకుడు ఏది చెపితే అలాగే చేశాము తప్ప మార్పులు చేర్పులు చేయాలని ఒత్తిడి చేయలేదు. అయినప్పటికీ ఆ సినిమా ఫెయిల్ అయింది. మా బెస్ట్ ఇచ్చిన్నప్పటికీ సినిమా ఫెయిల్ అయినందున నేను బాధపడలేదు. కానీ ఆ సినిమాలో ఒక్క విషయంలో మాత్రం చాలా బాధపడ్డాను. నేను రామ్ చరణ్ కలిసి చేసిన మొదటి సినిమా ఆచార్య. అదే ఫెయిల్ అవడం నాకు చాలా బాధ కలిగించింది,” అని అన్నారు.
చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలపై అప్పుడే సినీ విశ్లేషకులు, సోషల్ మీడియా మేధావులు విశ్లేషిస్తూ, “చిరంజీవి తప్పును దర్శకుడు కొరటాల శివపైకి నెట్టేయాలనుకొంటున్నారు. కానీ ఆచార్య హిట్ అయితే ఆ క్రెడిట్ తాను, తన కొడుకు రామ్ చరణ్‌లకే దక్కేది కదా?అప్పుడూ ఈ క్రెడిట్ మాది కాదు కొరటాల శివదే అని చెపుతారా? అయినా ఏ దర్శకుడైనా ప్రేక్షకులను మెప్పించే మంచి సినిమా తీద్దామనే ప్రయత్నిస్తాడు తప్ప ఏదో ఒకటి తీసేసి ఇండస్ట్రీలో చులకన అవ్వాలని కోరుకోడు కదా?” అంటూ చిరంజీవిపై సోషల్ మీడియాలో సునిశిత విమర్శలు వినిపిస్తున్నాయి.
అంతే కాదు... ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమా అద్భుతంగా ఉందని చిరంజీవి పొగుడుతున్నారు. ఒకవేళ రేపు అదీ ఫ్లాప్ అయితే అప్పుడు దర్శకుడు మోహన్ రాజాని కూడా ఇలాగే నిందిస్తారా? నాలుగు దశాబ్ధాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న చిరంజీవి సరైన కధలను ఎంచుకోవడంలో విఫలమవుతున్నానని అంగీకరించరా? సినిమా అనుకొన్నంత గొప్పగా రావడంలేదని సినిమా తీస్తున్నప్పుడే గుర్తించలేరా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.