ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన తండ్రి అల్లు రామలింగయ్య పేరిట గండిపేటలో అల్లు స్టూడియోని నిర్మించారు. నేడు చిరంజీవి దానికి ప్రారంభోత్సవం చేశారు. ఇక్కడ చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే, తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నవారందరూ దాదాపు ఆంధ్రాకు చెందినవారే అయినప్పటికీ వారిలో ఎవరూ కూడా ఆంధ్రప్రదేశ్‌లో స్టూడియోలు ఏర్పాటు చేసేందుకు, సినిమాలు తీసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కారణం అందరికీ తెలిసిందే.
తెలుగు సినీ పరిశ్రమలో రాజకీయాలతో సంబంధాలు ఉన్నవారు చాలామందే ఉన్నారు ముఖ్యంగా టిడిపి, జనసేనల పార్టీలతో సంబందాలున్నవారు చాలమందే ఉన్నారు. ఇదీగాక సినీ ప్రముఖుల మూలాలు ఏపీలో ఉన్నప్పటికీ వారు హైదరాబాద్ నగరానికి, సిఎం కేసీఆర్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఏపీ ప్రభుత్వాన్ని, సిఎం జగన్‌ను పెద్దగా పట్టించుకోవడంలేదనే భావన ఏపీ మంత్రుల మాటలలో స్పష్టంగా వినిపించింది. కనుక జగన్ ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమను కూడా రాజకీయ కోణంలోనుంచే చూస్తూ ఇబ్బందులకు గురిచేసింది.
అప్పుడు మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, దిల్‌రాజు వంటి సినీ ప్రముఖులు అందరూ సిఎం జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి చేతులు జోడించి ప్రార్ధించవలసి వచ్చింది. అప్పుడే ఆయన తెలుగు సినీ పరిశ్రమను ఆంధ్రాకు తరలిరావాలని కోరారు. కోరారనేకంటే ఆజ్ఞాపించారని చెప్పవచ్చు. కానీ తమను ఇంతగా ఇబ్బంది పెడుతున్నప్పుడు వందల కోట్లు పెట్టుబడి పెట్టి ఏపీలో స్టూడియోలను ఎవరు స్థాపిస్తారు?ఆవిదంగా చేస్తే వారు వైసీపీ నేతల చేతికి పూర్తిచిక్కిపోతారు. అప్పుడు వారి కనుసన్నలలో బ్రతకాల్సి ఉంటుంది. అందుకే తెలుగు సినీ పరిశ్రమలో ఎవరూ ఏపీకి వెళ్ళేందుకు ఇష్టపడటం లేదు.
దీంతో వారు ఇంకా ఇబ్బందులు ఎదుర్కోక తప్పడంలేదు. నేటికీ సినీ నటుల పట్ల జగన్ ప్రభుత్వ తీరు ఆక్షేపనీయంగానే ఉంటోంది. అందుకే తమను ఎంతగానో ఆదరిస్తున్న హైదరాబాద్‌లోనే తెలుగు సినీ పరిశ్రమ స్థిరపడింది. ఇందుకు తాజా నిదర్శనమే గండిపేటలో అల్లు స్టూడియో స్థాపన.
ఏపీ ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమను ఓ రాజకీయ ప్రతిపక్షంగా చూస్తోంది తప్ప బంగారు గుడ్లు పెట్టే బంగారు బాతు అని గుర్తించలేకపోతోంది. కానీ సిఎం కేసీఆర్ గుర్తించి, సముచిత గౌరవం, సహాయసహకారాలు అందిస్తున్నారు. అందువల్లే సినీ పరిశ్రమ హైదరాబాద్‌లో నిలద్రొక్కుకొంది. దానిలో కొన్ని వేలమంది ప్రత్యక్షంగా ఉద్యోగాలు, ఉపాడి పొందుతున్నారు. సినీ నిర్మాణానికి అవసరమైన వేలాది రకాల వస్తువులు, ఉత్పత్తులు, రవాణా, కేటరింగ్ వంటి సేవలను అందిస్తూ అనేకమంది భారీగా ఆదాయం పొందుతున్నారు.
ఇప్పుడు తెలుగు సినిమాలు వందల కోట్లు పెట్టుబడి పెట్టేస్థాయికి కూడా ఎదిగింది. అంటే ఆమేరకు దాని అవసరాలు, ఖర్చులు కూడా పెరుగుతాయి. అవన్నీ తెలంగాణ రాష్ట్రానికి పరోక్షంగా ఆదాయం సమకూర్చుతున్నాయి. అలాగే సినిమాల షూటింగ్, అనుమతులు, వాటి ఆదాయం ద్వారా ఫీజులు, పన్నులు తెలంగాణ రాష్ట్రానికే దక్కుతున్నాయి. ఇది గ్రహించ(లే)ని జగన్ ప్రభుత్వం సినీ పరిశ్రమను ప్రతిపక్ష పార్టీగా చూస్తూ దూరం చేసుకోవడం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా నష్టపోతోంది. ఇది వారి దురదృష్టం... తెలంగాణ అదృష్టం.