తెలంగాణలో గిరిజనులకు ఇక నుంచి 10 శాతం రిజర్వేషన్లు

October 01, 2022


img

తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అర్దరాత్రి జీవో నం.33 జారీ చేసింది. చెల్లప్ప కమీషన్‌కు సిఫార్సుల మేరకు రాష్ట్రంలో గిరిజనుల ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం 6 శాతంగా ఉన్న వారి రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతున్నట్లు జీవోలో పేర్కొంది. విద్యా, ప్రభుత్వోద్యోగాల నియామకాలలో ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని జీవోలో పేర్కొంది. తాజా పెంపుతో తెలంగాణలో అన్ని వర్గాలకు కలిపి రిజర్వేషన్లు 64 శాతానికి చేరాయి. వీటిలో ఎస్సీలకు 15, ఎస్టీలకు 10, బీసీలకు 29, ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం కలిపి మొత్తం 64 శాతానికి చేరాయి. 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిన్న యాదాద్రి పర్యటన ముగించుకొని ప్రగతి భవన్‌కి తిరిగిరాగానే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ వివిద శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యి ఈ అంశంపై చర్చించి ఆమోదం తెలిపారు. 

గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడంతో రవి టిఆర్ఎస్‌ శ్రేణులు సంబురాలు చేసుకొంటున్నాయి. సిఎం కేసీఆర్‌ చిత్రపఠాలకి పాలాభిషేకాలు చేస్తూ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నారు. అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అన్ని వర్గాలకు కలిపి రిజర్వేషన్లు 50 శాతం మించకూడదు. అంతకి మించి రిజర్వేషన్లు అమలుచేయాలంటే పార్లమెంటులో చట్ట సవరణ చేసి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. కానీ తమిళనాడు రాష్ట్రంలో 60 శాతం పైనే రిజర్వేషన్లు అమలవుతున్నందున తెలంగాణలో అమలుచేయడానికి ఎటువంటి న్యాయపరమైన అవరోధం ఉండబోదని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. ఒకవేళ న్యాయపరమైన సమస్య ఎదురైతే కేంద్రం జవాబు చెప్పుకోవలసి ఉంటుందని కేసీఆర్‌ ముందే హెచ్చరించారు. కనుక దీనిలో రాజకీయ కోణం కూడా ఉందని భావించవచ్చు. ఇంతకీ తెలంగాణలో ఈ రిజర్వేషన్లు అమలవుతాయా లేక హైకోర్టు, సుప్రీంకోర్టు అడ్డుకొంటాయా?అనేది త్వరలోనే తెలుస్తుంది. 


Related Post