పుతిన్ ధాటికి రష్యా యువత కూడా పరుగో పరుగు!

September 28, 2022


img

ఉక్రెయిన్ దేశంపై గత ఏడు నెలలుగా రష్యా సేనలు బాంబులతో విరుచుకుపడుతూనే ఉన్నాయి. రష్యాని ఆపగలిగే శక్తి అమెరికాతో సహా ప్రపంచంలో ఏ దేశానికి లేదని తేలిపోవడంతో ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఇంకా రెచ్చిపోతూ ఉక్రెయిన్‌లో తన మారణహోమం కొనసాగిస్తూనే ఉన్నాడు. 

కేవలం వారం, పది రోజులలోనే ఉక్రెయిన్‌ తమకు పూర్తిగా లొంగిపోతుందనే గట్టి నమ్మకంతో యుద్ధం ప్రారంభించిన పుతిన్‌కు, ఏడు నెలలు గడిచిపోయినా ఇంతవరకు ఉక్రెయిన్‌ లొంగకపోవడం పెద్ద షాక్ అనే చెప్పాలి. ఉక్రెయిన్‌ ప్రజలు, సేనలు నేటికీ ఎదురొడ్డిపోరాడుతుండటంతో రష్యా భారీగా సైనికులను కోల్పోతోంది. 

కనుక ఆ లోటును భర్తీ చేసుకొనేందుకు దేశంలో యువతని బలవంతంగా సైన్యంలో భర్తీ చేయడం ప్రారంభించింది. ఇప్పటికే ఈ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించడంతో రష్యాలో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలు తమ అధ్యక్షుడు పుతిన్‌ తీవ్ర ఆగ్రహం, అసహనంగా ఉన్నారు. 

ఇప్పుడు చేతికి అందివచ్చిన తమ పిల్లలను కూడా బలవంతంగా సైన్యంలో చేర్చడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ యుద్ధం వలన ఉక్రెయిన్‌లో ప్రజల దయనీయ పరిస్థితులను కళ్ళారా చూస్తున్న యువత రష్యా తరపున ఉక్రెయిన్‌పై యుద్ధంలో పాల్గొనేందుకు నిరాకరిస్తున్నారు. కానీ ప్రభుత్వం బలవంతంగా సైన్యం చేర్చడం మొదలుపెట్టడంతో రష్యా నుంచి వేలాదిమంది యువతీయువకులు పొరుగు దేశాలకు వలస వెళ్ళిపోతున్నారు. 

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ నిర్ణయం ప్రకటించిన మర్నాటి నుంచి రష్యాలో వివిద ప్రాంతాలలో విమానాశ్రయాల నుంచి వందలాది విమానాలు ఇరుగుపొరుగు దేశాలకు వెళుతున్న ఫోటోలు అంతర్జాతీయ మీడియాలో ప్రముఖంగా వచ్చాయి కూడా. ఇప్పుడు రష్యా నుంచి విదేశాలకు పారిపోతున్న యువత సంఖ్య మరింత పెరిగింది. 

రష్యా బాంబులతో ఉక్రెయిన్‌పై దాడులు ప్రారంభినప్పుడు లక్షలాదిమంది ఉక్రెయిన్‌ పౌరులు ప్రాణభయంతో ఇరుగుపొరుగు దేశాలకు తరలిపోయారు. కానీ ఇప్పుడు రష్యా యువత కూడా పుతిన్ భయంతో దేశం విడిచి పారిపోవలసివస్తోంది. నరహంతకుడిగా మారిన పుతిన్ నిర్ణయాలు, ఆలోచనలు తప్పని రష్యా యువత చెప్పకనే చెపుతున్నారు.


Related Post