నవంబర్‌ 6 లేదా 13న మునుగోడు పోలింగ్?

September 28, 2022


img

మునుగోడు ఉపఎన్నికల షెడ్యూల్ ఇంకా ప్రకటించకమునుపే కాంగ్రెస్‌, బిజెపిలు తమ అభ్యర్ధులను ప్రకటించేసి ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టేశాయి. సిఎం కేసీఆర్‌ టిఆర్ఎస్‌ అభ్యర్ధి పేరును ప్రకటించలేదు కానీ మునుగోడు ఉపఎన్నికల కోసం గిరిజనబంధు, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు వంటి తాయిలాలు ప్రకటించి సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్‌ మొదటివారంలో నోటిఫికేషన్‌, నవంబర్‌ రెండో వారంలోగా పోలింగ్ జరుగుతాయని సిఎం కేసీఆర్‌ ఇదివరకే జోస్యం చెప్పారు.

అది ఎలా అంటే, హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు 2017, నవంబర్‌లో 9వ తేదీన జరిగాయి. కనుక మళ్ళీ 2022, నవంబర్‌లో జరుగుతాయి. నవంబర్‌ 6, 13 తేదీలు ఆదివారం పడ్డాయి. కనుక ఆ రెండు రోజులలో ఏదో ఓ రోజు హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కనుకే ఎన్నికల కమీషన్‌ వాటితో పాటు తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడు ఉపఎన్నికలు కూడా నిర్వహించే అవకాశం ఉంటుంది. 

అయితే సిఎం కేసీఆర్‌ ఇంతవరకు అభ్యర్ది పేరును ప్రకటించకుండా నోటిఫికేషన్‌ కోసం వేచి చూస్తుండటం ప్రజలతో సహా కాంగ్రెస్‌, బిజెపిలు కూడా ఆశ్చర్యపడుతున్నాయి. కాంగ్రెస్‌, బిజెపిలు మునుగోడులో జోరుగా ఎన్నికల ప్రచారం చేసుకొంటుంటే సిఎం కేసీఆర్‌ ఇంతవరకు అభ్యర్ధిని ప్రకటించకపోవడం వెనుక ఏం వ్యూహం ఉంటుంది?అని ఆలోచిస్తే రెండు బలమైన కారణాలు కనిపిస్తున్నాయి.  

1. హుజురాబాద్‌ ఉపఎన్నికలను సిఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు అందరినీ మోహరించి సర్వశక్తులు ఒడ్డి పోరాడినందున ఆ ఓటమిని అందరూ సిఎం కేసీఆర్‌ ఓటమిగానే భావించారు. మళ్ళీ అటువంటి తప్పు పునరావృతం కాకూడదనే ఈవిదంగా చేస్తున్నారేమో? 

2. ఈ ఉపఎన్నికలలో ఓటమి తప్పదని కేసీఆర్‌ భావిస్తున్నందున దీనికి తమ పార్టీ అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదని ప్రజలకు సంకేతాలు పంపేందుకే కేసీఆర్‌ ఈవిదంగా చేస్తుండవచ్చు. టిఆర్ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ కూడా మునుగోడు ఉపఎన్నికలపై మాట్లాడకపోవడం గమనిస్తే ఈ అనుమానం బలపడుతుంది. 

ఈ ఉపఎన్నికలను టిఆర్ఎస్‌ సీరియస్‌గా తీసుకోలేదు కనుక ఓడిపోయినా పార్టీపై పెద్దగా ప్రభావం పడదని కేసీఆర్‌ భావిస్తున్నారేమో? ఒకవేళ ఈ అనుమానం నిజమైతే ముందు అనుకొన్నట్లుగా టిఆర్ఎస్‌ అభ్యర్ధిగా సుఖేందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలలో ఎవరో ఒకరిని కాకుండా కొత్త అభ్యర్ధిని నిలబెట్టి నామమాత్రపు ప్రచారంతో సరిపెట్టవచ్చు. అప్పుడు టిఆర్ఎస్‌ అభ్యర్ధి ఓడిపోయినా ఈ ఉపఎన్నికలను టిఆర్ఎస్‌ సీరియస్‌గా తీసుకోలేదు కనుకనే ఈ ఉపఎన్నికలలో బిజెపి గెలవగలిగిందని వాదించవచ్చని కేసీఆర్‌ భావిస్తున్నారేమో? ఏది ఏమైనప్పటికీ సిఎం కేసీఆర్‌ త్వరలోనే టిఆర్ఎస్‌ అభ్యర్ధిని ప్రకటించక తప్పదు. అప్పుడు అసలు విషయం బయటపడుతుంది.


Related Post