కేసీఆర్‌కు ప్రశాంత్ కిషోర్ సలహాలు అవసరమా?

September 27, 2022


img

తెలంగాణ సిఎం కేసీఆర్‌కి రాజకీయ, ఎన్నికల వ్యూహాలు అమలుచేయడంలో ఎంతో నేర్పు ఉంది. జాతీయ రాజకీయాలలో ప్రవేశించేందుకు ఆయన ఎంచుకొంటున్న మార్గాలను, అనుసరిస్తున్న వ్యూహాలను గమనిస్తే ఈ విషయం అర్దమవుతుంది. ఇప్పుడు వివిద రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, ప్రాంతీయ పార్టీల అధినేతలు హైదరాబాద్‌ వచ్చి ఆయనను కలిసి జాతీయ రాజకీయాల గురించి చర్చిస్తుండటమే ఇందుకు నిదర్శనం. 

అయితే ఇప్పుడు ఇదే కారణంగా ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ టిఆర్ఎస్‌తో చేసుకొన్న ఒప్పందం రద్దు చేసుకొన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో టిఆర్ఎస్‌ను గెలిపించడం కోసం మాత్రమే ఐప్యాక్ ఒప్పందం చేసుకొంది. అప్పుడు తాను భవిష్యత్‌లో జాతీయ రాజకీయాలలో ప్రవేశించాలనే ఆలోచన ఉన్నట్లు చెప్పలేదని, కానీ ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా తమ సేవలు ఆశిస్తున్నారని, అది సాధ్యం కాదు కనుకనే టిఆర్ఎస్‌తో ఒప్పందం రద్దు చేసుకొంటున్నట్లు తెలుస్తోంది. 

అయితే మరో బలమైన కారణం కూడా వినబడుతోంది. సిఎం కేసీఆర్‌ ఐప్యాక్‌తో ఒప్పందం చేసుకొన్నప్పటికీ, దానికి టిఆర్ఎస్‌ పార్టీ వ్యవహారాలలో వేలుపెట్టేందుకు అంగీకరించడంలేదని, అది ఇచ్చే నివేదికలను పట్టించుకోవడం లేదని, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, టిఆర్ఎస్‌ అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించేందుకు ఐప్యాక్‌ బృందానికి సిఎం కేసీఆర్‌ అపాయింట్ ఇవ్వడం లేదనే మరికొన్ని కారణాలు కూడా వినబడుతున్నాయి. మునుగోడు ఉపఎన్నికలలో కూడా ఐప్యాక్ పనిచేయవలసి ఉంది. కానీ ఇప్పుడు దానిని కూడా రద్దు చేసుకొని ఐప్యాక్ బృందంలోని సుమారు 200 మంది సభ్యులను ఏపీకి తరలించినట్లు తెలుస్తోంది. 

కారణాలు ఏవైనప్పటికీ టిఆర్ఎస్‌-ఐప్యాక్ మద్య ఒప్పందం రద్దు అయ్యింది. కనుక తెలంగాణలో జరుగబోయే ఎన్నికలకు పూర్తి బాధ్యత మళ్ళీ కేసీఆర్‌పైనే పడింది. అయితే ఒక ఆశయం, సిద్దాంతం లేకుండా ఎన్నికలను వ్యాపారంగా మార్చేసి డబ్బు సంపాదించడమే లక్ష్యంగా భిన్నదృవాల వంటి పార్టీలకు పనిచేసే ప్రశాంత్ కిషోర్ వంటి వ్యక్తులను చేరదీయడం, నమ్ముకోవడం టిఆర్ఎస్‌కు ఎంతమాత్రం మంచిది కాదు. కనుక ఇదీ టిఆర్ఎస్‌ మంచికే జరిగిందని భావించవచ్చు.  Related Post