ముందు కాంగ్రెస్‌ను జోడించండి.. తర్వాత భారత్‌ను జోడించవచ్చు

September 26, 2022


img

కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్‌ జోడో (భారత్‌ను జోడిద్దాం) పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తన పాదయాత్రతో భారత్‌ను కలుపుదామని బయలుదేరితే మరోవైపు రాజస్థాన్‌ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తామని బెదిరిస్తుండటంతో అక్కడ కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్‌ కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్ష పదవికి పోటీ చేస్తుండటంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకతప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయన తన వర్గానికి చెందిన వ్యక్తిని ఆ సీటులో కూర్చోబెట్టాలనుకొంటే, గతంలో ముఖ్యమంత్రి పదవికి ఆయనతో పోటీపడిన సచిన్ పైలట్‌ ఇప్పుడు ఆ పదవి తనకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అతనిని అడ్డుకొంటూ, కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి చేపట్టేందుకు అశోక్ గెహ్లోత్‌ తన వర్గానికి చెందిన 92మంది ఎమ్మెల్యేలతో రాజీనామా డ్రామా ఆడిస్తున్నారు. దీంతో రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ నిలువునా రెండుగా చీలిపోయి, ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. 

రాజస్థాన్‌లోని ఈ పరిణామాలపై కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ట్విట్టర్‌లో అశోక్ గెహ్లోత్‌, రాహుల్ గాంధీ, సచిన్ పైలట్‌ ముగ్గురూ ఉన్న ఓ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసి, రాహుల్‌జీ! ముందు వీరిద్దరినీ కలపండి. తర్వాత భారత్‌ను జోడిద్దురుగాని...” అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. 

మరో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పందిస్తూ, “మీ శిబిరాల ప్రభుత్వం మరోసారి రిసార్తులకు వెళ్ళేందుకు సిద్దమవుతోంది,” అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. 

 కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి ఈనెల 24 నుంచి నెలాఖరు వరకు నామినేషన్స్, అక్టోబర్‌ 1వ తేదీన వాటి పరిశీలన, అక్టోబర్‌ 8వరకు వాటి ఉపసంహరణ గడువు, అక్టోబర్‌ 17వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్‌ 19వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు.    Related Post