కాంగ్రెస్‌ అధిష్టాన్ని అశోక్ గెహ్లోత్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారా?

September 26, 2022


img

కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు సోనియా, రాహుల్, ప్రియాంకా ముగ్గురూ నిరాకరించడంతో ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఈ పదవికి రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్, ఎంపీ శశిథరూర్ పోటీ పడుతున్నారు. అయితే ఒక వ్యక్తికి ఒక పదవి మాత్రమే చేపట్టాలని రాహుల్ గాంధీ సూచించడంతో అశోక్ గెహ్లోత్‌కు మొదటే అవరోధం ఏర్పడింది. 

ఆయన ముఖ్యమంత్రి పదవి వదులుకోవడానికి సిద్దంగా లేరు. అలాగే కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడుగా తనే ఉండాలని కోరుకొంటున్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చినా అధికారం తన చేతిలోనే ఉండాలని కోరుకొంటున్నారు. కనుక ఆయన చాలా తెలివిగా తమ పార్టీ అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. 

ఆయన ప్రభుత్వంలో 92 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు నిన్న రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఒకవేళ గెహ్లోత్ రాజీనామా చేసే మాటయితే ఆయన మద్దతుదారులుగా ఉన్న తమలో ఒకరిని ముఖ్యమంత్రిని చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాదని సచిన్ పైలట్‌ని ముఖ్యమంత్రి చేస్తే గవర్నర్‌ను కలిసి తమ రాజీనామా పత్రాలు సమర్పిస్తామని హెచ్చారించారు. దీనిపై అశోక్ గెహ్లోత్ స్పందిస్తూ పరిస్థితి తన చెయ్యి దాటిపోయిందని, ఇప్పుడు తానేమీ చేయలేనని చెపుతున్నారు. 

అంటే ఒకవేళ కాంగ్రెస్‌ అధిష్టానం తనను రెండు పదవులు చేపట్టేందుకు అనుమతించకపోతే రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు వెనుకాడనని హెచ్చరిస్తున్నట్లే భావించవచ్చు. ఒకవేళ తాను రాజీనామా చేయవలసి వస్తే ముఖ్యమంత్రి పదవి తన అనుచరుడికే ఇప్పించుకోవాలని అశోక్ గెహ్లోత్ యోచిస్తున్నట్లున్నారు. తన రాజకీయ ప్రయోజనం కోసం కాంగ్రెస్ పార్టీనే దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్న ఇటువంటి వ్యక్తి చేతిలో కాంగ్రెస్ పార్టీని పెడితే ఏమవుతుందో ఊహించుకోవచ్చు.


Related Post