హుజురాబాద్ ఉపఎన్నికలలో టిఆర్ఎస్ ఓటమి ప్రభావం సిఎం కేసీఆర్పై బాగానే పడినట్లు కనిపిస్తోంది. అందుకే ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ఈ ఉపఎన్నికలకు ముందు గిరిజన బంధు ప్రకటించడమే కాకుండా గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించారు. మునుగోడు ఓటర్లకు విందులు, వనభోజనాలు ఏర్పాటుచేసి వారి ఓట్లు టిఆర్ఎస్కు ఓట్లు పడేలా చేయాలని నియోజకవర్గంలో నేతలకు కేసీఆర్ సూచించారు.
ఈ ఉపఎన్నికలలో టిఆర్ఎస్ భారీ మెజార్టీతో విజయం సాధించబోతోందని, టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మొదటి ఒకటి రెండు స్థానాలలో నిలిస్తే బిజెపి మూడో స్థానంలో మిగిలిపోతుందని సర్వేలో తేలిందని కేసీఆర్ పార్టీ నేతలకు ధైర్యం చెప్పారు. కానీ ఇంతవరకు టిఆర్ఎస్ అభ్యర్ధిని ప్రకటించలేదు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత అభ్యర్ధిని ప్రకటించాలని ఎందుకు అనుకొంటున్నారో తెలీదు కానీ ఈ నిర్ణయం పార్టీ నేతలను, రాజకీయ విశ్లేషకులను కూడా ఆశ్చర్యపరుస్తోంది.
బహుశః ఈ ఉపఎన్నికల కోసమే సిఎం కేసీఆర్ జాతీయ రాజకీయ ప్రవేశాన్ని డిసెంబర్ వరకు వాయిదా వేసుకొన్నట్లు భావించవచ్చు. బిజెపి అంటే తమకు భయం లేదని చెప్పేందుకు, దానికి అంత సీన్ లేదని కాంగ్రెస్ పార్టీతోనే మాకు పోటీ అని కేసీఆర్ చెప్పారు. కానీ ఈ ఉపఎన్నికలలో పోటీ ప్రధానంగా టిఆర్ఎస్-బిజెపిల మద్యే పోటీ ఉంటుందని అందరికీ తెలుసు. టిఆర్ఎస్, బిజెపి ధాటికి కాంగ్రెస్ నిలబడలేదు కానీ మునుగోడులో ఓట్లు చీల్చి రెండు పార్టీలకు నష్టం కలిగించగలదు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి ఏమీ చేయని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరడాన్ని ఎవరూ తప్పు పట్టరు కానీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉపఎన్నికలు రుద్దినందుకు ప్రజలు ఆయనను తిరస్కరించే అవకాశం ఉంటుంది.
కనుక టిఆర్ఎస్కు విజయావకాశాలు బాగానే ఉన్నట్లు భావించవచ్చు. అయితే హుజురాబాద్ ఉపఎన్నికలలో బిజెపి చాలా చిత్రవిచిత్రమైన వ్యూహాలతో టిఆర్ఎస్ను మట్టి కరిపించింది. కనుక కేసీఆర్ ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నారు. మరి ఈసారి ఆయన వ్యూహాలు ఫలిస్తాయో లేదో చూడాలి.