మునుగోడు యుద్ధానికి ఓట్లర్లే ప్రేక్షకులు

September 24, 2022


img

మునుగోడు ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ భారీ మెజార్టీతో గెలుస్తుందని, కాంగ్రెస్ పార్టీతోనే పోటీ ఉంటుందని, బిజెపి మూడో స్థానానికి పరిమితం అవుతుందని సిఎం కేసీఆర్‌ జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే. 

అయితే ఈ ఉపఎన్నికలలో మరోసారి బిజెపి చేతిలో టిఆర్ఎస్‌ (కేసీఆర్‌) ఓడిపోవడం ఖాయమని, తెలంగాణ టిఆర్ఎస్‌ పతనానికి ఇదే ప్రారంభం అని బండి సంజయ్‌ గట్టిగా వాదిస్తున్నారు. 

ఈ మూడు ముక్కలాటలో జయాపజయాలతో సంబందం లేకుండా కాంగ్రెస్ పార్టీ పాల్గొంటుంది. కనుక దాని ‘స్పోర్టివ్ స్పిరిట్‌’ను తప్పనిసరిగా మెచ్చుకోవలసిందే. బిజెపి, టిఆర్ఎస్‌ రెండూ దొందూ దొందే అని, వాటిలో దేనిని గెలిపించినా రెంటినీ గెలిపించినట్లే అని కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. అదీగాక తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ రుణం ఇంకా తీర్చుకోలేదని కనుక ఈ ఉపఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్ధి పాల్వాయి స్రవంతిని గెలిపించి ఆ రుణం తీర్చేసుకోవాలని రేవంత్‌ రెడ్డి గట్టిగా వాదిస్తున్నారు. 

ఈవిదంగా మూడు పార్టీలకు దేని వాదన దానికి ఉన్నాయి. అయితే నియోజకవర్గం... ప్రజల సంగతి ఏమిటి? అని ప్రశ్నిస్తే టిఆర్ఎస్‌ జవాబు చెప్పగలుగుతోంది కానీ కాంగ్రెస్‌, బిజెపిలు ప్రతిపక్షంలో ఉన్నాయి కనుక గెలిచినా ఏమీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. 

మూడేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన వ్యాపారాలు, కాంట్రాక్టులే చూసుకొన్నారు తప్ప ప్రజల గురించి పట్టించుకోలేదని టిఆర్ఎస్‌ వాదిస్తోంది. నియోజకవర్గం అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై ఎన్నిసార్లు సిఎం కేసీఆర్‌ అపాయింట్‌మెంట్ అడిగినా ఇవ్వకపోతే నేను మాత్రం ఏం చేస్తాను? అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాదిస్తున్నారు. అంటే రెండు పార్టీలు మునుగోడుని పట్టించుకోలేదని స్పష్టం అవుతోంది. ఇక బిజెపి సంగతి సరేసరి. హిందూ, ముస్లిం గురించి మాట్లాడుతుంది... ఇంకా గట్టిగా నిలదీస్తే ఢిల్లీలో ఉన్న మోడీని చూపిస్తుంటుంది తప్ప మునుగోడు అభివృద్ధి గురించి ఒక్క ముక్క మాట్లాడదు.  

మునుగోడు ఉపఎన్నికలకు ఒక్కో పార్టీ ఒక్కో కారణం, ఒక్కో రకమైన వాదన వినిపిస్తున్నప్పటికీ మూడు పార్టీల రాజకీయ ఆధిపత్యపోరులో భాగంగానే జరుగుతున్నాయని అందరికీ తెలుసు. మూడు పార్టీలలో దేని సత్తా ఎంత?అని పరీక్షించుకొని తేల్చుకొనేందుకే మునుగోడు ఉపఎన్నికలను తెచ్చిపెట్టినట్లు చెప్పవచ్చు. కనుక ఈ ఉపఎన్నికలో వాటి యుద్ధానికి ఓటర్లే ప్రేక్షకులు. ఆ ప్రేక్షకులు ఏం చేస్తారో చూడాలి.


Related Post