ప్రశాంత్ కిశోర్‌తో కేసీఆర్‌ ఒప్పందం రద్దు చేసుకొన్నారా?

September 23, 2022


img

ఇప్పుడు మీడియాలో వినిపిస్తున్న వార్త ఇదే. ప్రశాంత్ కిషోర్ తమ పార్టీ కోసం పనిచేస్తున్నారని కొంతకాలం క్రితం సిఎం కేసీఆర్‌ స్వయంగా చెప్పారు. ఆ తర్వాత ప్రశాంత్ కిశోర్ రెండు మూడుసార్లు ప్రగతి భవన్‌కి వెళ్ళి టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల పనితీరు, ప్రభుత్వంపై ప్రజాభిప్రాయం ఏవిదంగా ఉంది? టిఆర్ఎస్‌లో చేసుకోవలసిన మార్పులు చేర్పులు, ఎన్నికల వ్యూహాల గురించి కొన్ని నివేదికలు కూడా ఇచ్చారు. వాటి ప్రకారం సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కనీసం 50-60 మంది పనితీరు అసలు బాగోలేదని పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ కొన్ని నెలల తర్వాత ఇటీవల సిఎం కేసీఆర్‌ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ మళ్ళీ టికెట్స్ ఇస్తామని ప్రకటించేశారు. అంటే ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన నివేదికలను కేసీఆర్‌ పక్కన పడేసినట్లు అర్దమవుతోంది. కనుక ప్రశాంత్ కిషోర్‌కి చెందిన ఐప్యాక్ సేవలు కూడా అవసరం లేదని తేల్చి చెప్పినట్లే. 

సిఎం కేసీఆర్‌ ప్రశాంత్ కిషోర్-ఇప్యాక్ బృందం సేవలు వద్దనుకోవడానికి మరో బలమైన కారణం కూడా వినబడుతోంది. ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన సలహాతోనే సిఎం కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వంతో కోరుండి కయ్యం పెట్టుకొన్నారని ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకోలేని స్థితిలో బిజేపీతో, దాని వెనుకున్న బలమైన మోడీ ప్రభుత్వంతో యుద్ధం చేయవలసివస్తోందనే వాదన కూడా వినిపిస్తోంది. కారణాలు ఏవైనప్పటికీ టిఆర్ఎస్‌కు ఇక ప్రశాంత్ కిశోర్ సేవలు అవసరం లేదని తేలిపోయింది. కనుక ఐప్యాక్ బృందం హైదరాబాద్‌లో తమ కార్యాలయాన్ని విజయవాడకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తాజా సమాచారం.

గత ఎన్నికలలో ప్రశాంత్ కిషోర్‌-ఐప్యాక్ బృందం ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి ఆ పార్టీని ఎన్నికలలో గెలిపించి   అధికారంలోకి తేగలిగింది. కనుక వచ్చే ఎన్నికలలో కూడా ప్రశాంత్ కిషోర్‌-ఐప్యాక్ బృందం సేవలను వైసీపీ ఉపయోగించుకొంటోంది.  

నిజానికి అపర చాణక్యుడని పేరుగాంచిన కేసీఆర్‌కి ప్రశాంత్ కిషోర్ వంటి ఎన్నికల వ్యూహ నిపుణుల సలహాలు, సూచనలు అవసరమే లేదు. గత ఎన్నికలలో కాంగ్రెస్‌ కూటమిని, బిజెపిని ఒంటి చేత్తో ఎదుర్కొని టిఆర్ఎస్‌ పార్టీని గెలిపించుకొన్నారు. కనుక వచ్చే ఎన్నికలలో కూడా గెలిపించుకోగలరనే భావించవచ్చు. 


Related Post