ఈ నెల 25న ఉప్పల్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మద్య తొలి టి20 మ్యాచ్ జరుగబోతోంది. దాని కోసం నేడు సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో టికెట్ల అమ్మకం జరిగింది. టికెట్ల కోసం వేలాదిమంది తరలిరావడంతో క్యూలైన్లలో తొక్కిసలాటలు జరిగాయి. మెయిన్ గేట్ దూకి కొందరు లోనికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. జనాలను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ తొక్కిసలాట, లాఠీ ఛార్జ్ లో పలువురు గాయపడ్డారు. అనేకమంది మహిళలు సొమ్మసిల్లి తప్పిపడిపోయారు. ఈ తొక్కిసలాటలో కొందరు పోలీసులు కూడా గాయపడ్డారు.
ఈ ఘటనలపై క్రికెట్ అభిమానులు... పోలీసులను, ప్రభుత్వాన్ని, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)ని నిందిస్తే, పోలీస్ ఉన్నతాధికారులు హెచ్‌సీఈ వైఫల్యం కారణంగానే ఈవిదంగా జరిగిందంటూ ఆరోపించారు.
ఈ ఘటనలపై క్రీడల శాఖమంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందిస్తూ, “హెచ్‌సీఏ తన వైఫల్యాన్ని ప్రభుత్వంపై రుద్దినా, మా ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించినా సహించబోము. హెచ్‌సీఏ నిర్వాకం వలన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తింటోంది. టికెట్ల అమ్మకాలకు సరైన ఏర్పాట్లు చేయకపోవడం వలననే ఈవిదంగా జరిగిందని భావిస్తున్నాము. హెచ్‌సీఏ తీరు మార్చుకోకపోతే దానికి స్టేడియం లీజు కాంట్రాక్టును రద్దు చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని స్టేడియం నిర్వహణ బాధ్యతలు చూసుకొంటుంది. కనుక ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా హెచ్‌సీఏ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను,” అని అన్నారు.
మంత్రి వార్నింగ్‌కు హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ కూడా అంతే ఘాటుగా స్పందించారు. “క్రికెట్ మ్యాచ్ నిర్వహణ అంటే ఆఫీసులో కూర్చొని మాట్లాడటం కాదు. దానిలో చాలా సమస్యలు ఉంటాయి. కనుక ఈరోజు జరిగిన లోపాలను పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొంటాము. ఇవాళ్ళ ఈ కుర్చీలో నేనుంటాను... రేపు మరొకరు ఉంటారు. ఎవరు కూర్చోన్నా హైదరాబాద్ నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరురావాలనే ఆశిస్తాము తప్ప రాజకీయాలు చేయవలసిన అవసరం మాకు లేదు.
చాలా ఏళ్ళ తర్వాత మ్యాచ్ జరుగుతోంది. కనుక మ్యాచ్ నిర్వహణను ఈవిదంగా నెగెటివ్ కోణంలో చూడటం సరికాదు. కొన్నిసార్లు ఈవిదంగా అనుకోని ఘటనలు జరుగుతుంటాయి. అందుకు పరిష్కారం ఆలోచించాలే కానీ ఈవిదంగా ఒకరినొకరు వేలెత్తి చూపుకోవడం సరికాదు. ఈరోజు తొక్కిసలాటలో గాయపడిన వారందరికీ హెచ్‌సీఏ అండగా ఉంటుంది. రాబోయే రోజుల్లో మ్యాచ్ నిర్వహణలో ప్రభుత్వాన్ని కూడా భాగస్వామిగా చేస్తాము,” అని అన్నారు.
కనుక జింఖానా తొక్కిసలాటలో పోలీసులది తప్పు లేదు. హెచ్‌సీఏ తప్పు లేదు. ప్రభుత్వం తప్పు కూడా లేదని తేలిపోయింది కనుక టికెట్లు కొనుకొన్నేదుకు బుదవారం అర్దరాత్రి నుంచి జింఖానా గ్రౌండ్స్ వద్ద క్యూలైంలలో పడిగాపులుగాసిన క్రికెట్ అభిమానులదే తప్పు అని సరిపెట్టుకోవలసిందే.