వైఎస్ షర్మిల పాదయాత్రకి ఫలితం దక్కినట్లేనా?

September 21, 2022


img

ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాలలో హటాత్తుగా ప్రవేశించి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టుకొని పాదయాత్ర చేస్తున్నారు. అయితే ఇంతకాలం ఆమె పాదయాత్రను ఎవరూ పట్టించుకోలేదనే చెప్పవచ్చు. ఆమె తన పాదయాత్రలో నిత్యం సిఎం కేసీఆర్‌ని విమర్శిస్తూ, ఆయన ప్రభుత్వం అవినీతికి, అక్రమాలకి పాల్పడుతోందని ఆమె ఆరోపిస్తున్నప్పటికీ ఏనాడూ టిఆర్ఎస్‌ పట్టించుకోలేదు. కానీ ఇటీవల ఆమెపై టిఆర్ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు స్పీకర్‌  పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో ఆమె అందరి దృష్టిని ఆకర్షించగలిగారు. స్పీకర్ తనపై చర్యలు తీసుకొంటారేమోనని వైఎస్ షర్మిల మొదట కాస్త జంకినా, ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆమె మళ్ళీ రెచ్చిపోయి సిఎం కేసీఆర్‌, టిఆర్ఎస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని పదేపదే సవాళ్ళు కూడా చేస్తున్నారు. 

బుదవారం ఆమె పాదయాత్రలో మీడియాతో మాట్లాడుతూ, “కేసీఆర్‌ను రెండుసార్లు ముఖ్యమంత్రిని చేస్తే ఏం చేశారు? ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలుచేయకుండా మళ్ళీ కొత్త హామీలు ఇస్తూ ప్రజలను వంచిస్తూనే ఉన్నారు.  నేను పరిగి నియోజకవర్గంలో కుర్చీ వేసుకొని కూర్చొని ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టును దగ్గరుండి పూర్తి చేయిస్తానని ఆనాడు సిఎం కేసీఆర్‌ గొప్పలు చెప్పారు. కానీ ఇక్కడ ఒక్క ఏకరానికైనా నీళ్ళు ఇచ్చారా?

అదే... మాతండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారే బ్రతికి ఉంటే 35,000 కోట్లతో ఈ ప్రాజెక్టు ఎప్పుడో పూర్తిచేసి నీళ్ళు అందించేఉండేవారు. ఆయన మాట మీద నిలబడే మనిషి. ప్రజల కోసమే ఆలోచించే గొప్ప వ్యక్తి. కానీ కేసీఆర్‌ ఎన్నికలలో గెలిచి అధికారం చేజిక్కించుకోవడం కోసం నోటికి వచ్చిన వాగ్ధానాలన్నీ చేస్తుంటారు. కుర్చీలో కూర్చోన్నాక అన్నీ మరిచిపోతారు. మళ్ళీ ఎన్నికలు రాగానే వరాలు కురిపిస్తుంటారు. 

ఈసారి నేను ఆయనను వేలెత్తి చూపుతూ విమర్శించినట్లయితే నన్ను గుడ్లతో కొట్టమన్నారట! నాపై గుడ్లు విసిరే బదులు వాటిని ఇంటికి తీసుకువెళ్ళి ఆమ్లెట్స్ వేసుకొని తింటే మీ కడుపులైనా నిండుతాయి కదా? కానీ నాపై గుడ్లు వేయాలనుకొంటే నాకేమీ అభ్యంతరం లేదు. మీరు గుడ్లే వేయిస్తారో రాళ్ళే వేయిస్తారో బాంబులే వేయిస్తారో మీ ఇష్టం. నేను దేనికి భయపడను. ఎందుకంటే నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను కనుక. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు సిఎం కేసీఆర్‌ అవినీతిని నేను ప్రశ్నిస్తూనే ఉంటాను,” అని సవాల్ విసిరారు. 


Related Post