అక్టోబర్‌లో నోటిఫికేషన్, నవంబర్‌లో మునుగోడు ఎన్నికలు: కేసీఆర్‌

September 21, 2022


img

కేంద్ర ఎన్నికల కమీషన్‌ ప్రకటించాల్సిన ఎన్నికల షెడ్యూల్‌ని తెలంగాణ సిఎం కేసీఆర్‌ ముందుగానే ప్రకటిస్తుండటం ఆశ్చర్యకరమే. మంగళవారం ప్రగతి భవన్‌లో ఉమ్మడి నల్గొండ జిల్లా టిఆర్ఎస్‌ నాయకులతో సిఎం కేసీఆర్‌ సమావేశమైనప్పుడు మునుగోడు ఉపఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్‌ మొదటివారంలో విడుదల కావచ్చని నవంబర్‌లో ఉపఎన్నికలు జరగవచ్చని చెప్పారు. కనుక పార్టీలో అందరూ ఉపఎన్నికలకు సిద్దంగా ఉండాలని సిఎం కేసీఆర్‌ వారికి సూచించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత చండూరులో బహిరంగ సభ నిర్వహించుకొందామని చెప్పారు. 

మునుగోడు ఉపఎన్నికలను బలవంతంగా తెచ్చిపెట్టిన బిజెపి ఇప్పుడు ఉపఎన్నికలను ఎదుర్కోవడానికి భయపడుతోందన్నారు. ఈ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ పార్టీయే గెలుస్తుందని, కాంగ్రెస్, బిజెపీలు రెండుమూడు స్థానాలకు పరిమితమవుతాయని సర్వేలో తేలిందన్నారు. మునుగోడులో ప్రతీ రెండు గ్రామాలకు ఓ ఎమ్మెల్యేని ఇన్‌ చార్జ్ ఛార్జ్ గా నియమించామని, కనుక అందరూ సమన్వయంతో పనిచేస్తూ ఈ ఉపఎన్నికలలో తెరాస అభ్యర్ధిని భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి కృషి చేయాలని సిఎం కేసీఆర్ సూచించారు. 

ముఖ్యంగా మునుగోడులో దళిత బంధు, గిరిజన బంధు, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్స్ గురించి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేయాలని సిఎం కేసీఆర్‌ ఆదేశించారు. మునుగోడు నుంచి ప్రతీరోజు వెయ్యిమంది ఆదివాసీలు, గిరిజనులను హైదరాబాద్‌కు తీసుకువచ్చి బంజారా హిల్స్‌లో వారికోసం కొత్తగా నిర్మించిన బంజారా, ఆదివాసీ భవన్‌లను చూపించి విందు భోజనాలు పెట్టి పంపాలని సిఎం కేసీఆర్ వారికి సూచించారు. మునుగోడు ప్రజలతో ఆత్మీయ సమ్మేళనాలు, వనభోజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ వారి కోసం మన ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పధకాలను వివరించాలని సిఎం కేసీఆర్ సూచించారు. 

ఈ సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి, టిఆర్ఎస్ జిల్లా ఇన్ ఛార్జ్, ఎమ్మెల్సీ తక్కళ్ళపల్లి రవీందర్ రావు, ఎమ్మేల్యేలు రవీంద్రకుమార్, చిరుమర్తి లింగయ్య, గ్యాదరి బాలామల్లు, మునుగోడు నుంచి పోటీ చేయబోతున్నట్లు చెప్పబడుతున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.


Related Post