కాలక్షేప రాజకీయాలు, సవాళ్ళు అవసరమా?

September 20, 2022


img

మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి పొరుగు రాష్ట్రం ఏపీలో అమరావతి కోసం మహాపాదయాత్ర చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు ఆమె కూడా దానిలో పాల్గొన్నారు. ఏపీలో జగన్ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా అంగీకరించడం లేదు. కనుక రైతుల పాదయాత్రను కూడా టిడిపి ప్రోత్సాహంతో జరుగుతున్న రాజకీయ పాదయాత్రగా వర్ణిస్తోంది. 

కనుక రేణుకా చౌదరి ఆ యాత్రలో పాల్గొనడాన్ని తప్పు పడుతూ ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని నిన్న శాసనసభలో ఘాటుగా రేణుకా చౌదరిపై విమర్శలు గుప్పించారు. ‘కార్పొరేటరుగా కూడా గెలవలేని ఆమె ఏపీలో పాదయాత్ర చేయడం, అమరావతి గురించి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారంటూ’ ఎద్దేవా చేశారు. 

రేణుకా చౌదరి కూడా ఆయనకి అంతే ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఆమె నిన్న మీడియాతో మాట్లాడుతూ, “నేను కార్పొరేటర్ కాలేదు నిజమే కానీ ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేశాను. కానీ ఎమ్మెల్యేగా ఎప్పుడు పనిచేయలేదు. కొడాలి మంచి ఐదియా ఇచ్చారు. కనుక వచ్చే ఎన్నికలలో నేను ఏపీలోని కొడాలి నాని సొంత నియోజకవర్గం గుడివాడ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. ఆయన నన్ను ఓడించగలరా?వచ్చే ఎన్నికలలో ఆయన ఓడిపోవడం ఖాయం. 

నేనేమిటో తెలియకనే కొడాలి నాని నాగురించి చులకనగా మాట్లాడారు. ఆయన పుట్టక ముందునుంచే నేను రాజకీయాలలో ఉన్నాను. నా గురించి ఖమ్మంలో ఏ గల్లీలో అడిగినా తెలుసుకోవచ్చు. ఒకవేళ ఖమ్మంకు రాలేకపోతే తన మొబైల్ ఫోన్‌లో రేణుకా చౌదరి అని పేరు కొడితే నేనేమిటో గూగుల్ చూపిస్తుంది. అయినా మీ ముఖ్యమంత్రి మెప్పు కోసం శాసనసభలో నన్ను విమర్శించి అక్కడ కూడా నా పేరు వినబడేలా చేసినందుకు కొడాలికి కృతజ్ఞతలు. ఈరోజుల్లో పబ్లిసిటీకి చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. కొడాలి నాని నాకు ఫ్రీగా పబ్లిసిటీ చేసినందుకు చాలా థాంక్స్,” అని అన్నారు. 

కొడాలి నాని, రేణుకా చౌదరీ ఇద్దరూ వేర్వేరు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు. వారు తమ ప్రాంతాలలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తే వారి వలన ప్రజలకు ఉపయోగం ఉంటుంది కానీ ఈవిదంగా ఊసుపోక కాలక్షేప రాజకీయాలు చేయడం వలన ఏం ప్రయోజనం? కనీసం వారిరువురికైనా దీని వలన ఏమైనా ప్రయోజనం ఉంటుందా?అంటే ఉండదనే చెప్పవచ్చు. మరి ఇటువంటి కాలక్షేప రాజకీయాలు ఎందుకు? వారి గొప్పలు ప్రజలకెందుకు? 


Related Post