తెలంగాణలో బిజెపి అధికారం దక్కించుకోవాలని పట్టుదలగా ప్రయత్నాలు చేస్తుండటం, అదే సమయంలో ప్రధాని నరేంద్రమోడీని గద్దె దించాలని సిఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించేందుకు సిద్దమవుతుండటంతో తెలంగాణ రాజకీయాలపై మీడియాలో చాలా ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి.
ఇటీవల ఓ న్యూస్ ఛానల్‌లో టిఆర్ఎస్-మజ్లీస్ పార్టీల దోస్తీపై చర్చ జరిగింది. ఈ చర్చలో పాల్గొన్న రాజకీయ విశ్లేషకులలో ఒకరు ఆ రెండు పార్టీల మద్య స్నేహం కలకాలం కొనసాగకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేసారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో పరస్పరం ప్రయోజనం చేకూర్చుకొనేందుకు ఆ రెండు పార్టీలు విడిపోయి కత్తులు దూసుకొంటూ నటిస్తూ ప్రజలను మభ్యపెట్టినప్పటికీ, భవిష్యత్‌లో అది నిజంగా జరగవచ్చని జోస్యం చెప్పారు.
అదే కనుక జరిగితే ఇప్పటివరకు పాతబస్తీకే పరిమితమవుతున్న మజ్లీస్ పార్టీ అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయడం ఖాయమని అన్నారు. ఇంతవరకు మజ్లీస్ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయడం లేదు కనుకనే ముస్లింల ఓట్లు గంపగుత్తగా టిఆర్ఎస్‌కు పడుతున్నాయని కానీ అప్పుడు ముస్లింల ఓట్లు చీలిపోతే టిఆర్ఎస్ నష్టపోతుందని అన్నారు.
కనుక మజ్లీస్‌ను పాతబస్తీకే పరిమితంగా ఉంచేందుకే సిఎం కేసీఆర్ ఓవైసీలతో సఖ్యంగా ఉంటున్నారని కానీ మజ్లీస్‌తో ఏ పార్టీ కూడా చిరకాలం దోస్తీ నిభాయించడం కష్టమని అభిప్రాయం వ్యక్తం చేసారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు మజ్లీస్ పార్టీని విస్తరించాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్న అసదుద్దీన్ ఓవైసీ ఎల్లకాలం పాతబస్తీకే పరిమితంగా ఉండిపోతారనుకోలేము కనుక ఏదో రోజున తెలంగాణలో అన్ని జిల్లాలలో మజ్లీస్ పోటీకి దిగవచ్చని జోస్యం చెప్పారు.
ఒకవేళ టిఆర్ఎస్, మజ్లీస్ పార్టీలు పరస్పరం పోటీ పడితే మద్యలో బిజెపి కూడా లబ్ది పొందుతుందని జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో రుజువైంది. కనుక మజ్లీస్‌తో టిఆర్ఎస్ దోస్తీ అనివార్యంగా మారింది. కానీ వాటి దోస్తీ ఎంతకాలం సాగుతుందో చూడాలి.