సిఎం కేసీఆర్ తాను హైదరాబాద్ కేంద్రంగా జాతీయ రాజకీయాలు చేస్తానని చెప్పినమాట నిజమవుతోంది. వివిద రాష్ట్రాలకు చెందిన ప్రతిపక్ష నేతలు ఒకరొకరుగా హైదరాబాద్ వచ్చి ఆయనను కలిసి జాతీయ రాజకీయాలపై చర్చిస్తున్నారు. తాజాగా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘేల ఇదే పనిమీద శుక్రవారం హైదరాబాద్ వచ్చి సిఎం కేసీఆర్‌ను కలిశారు. వారిరువురూ దాదాపు 5 గంటలు దేశ రాజకీయాలు, డిసెంబర్‌లో జరుగబోయే గుజరాత్ శాసనసభ ఎన్నికల గురించి చర్చించుకొన్నారు.
పదవీ, అధికారమే పరమావదిగా భావించే
శంకర్ సింగ్ వాఘేలా పలు పార్టీలు మారి గతంలో ఒకసారి గుజరాత్ ముఖ్యమంత్రి కాగలిగారు.
ఈ ఏడాది డిసెంబర్‌లో జరుగబోయే శాసనసభ ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి కావాలని తహతహలాడుతున్నారు.
కానీ గుజరాత్‌లో అధికారంలో ఉన్న బిజెపి చాలా బలంగా ఉంది. సిఎం కేసీఆర్ బిజెపితో, మోడీ ప్రభుత్వంతో గట్టిగా పోరాడుతున్నారు కనుక గుజరాత్ ఎన్నికలలో బిజెపిని
ఓడించి తాను ముఖ్యమంత్రి అయ్యేందుకు తోడ్పడతారనే ఉద్దేశ్యంతో కేసీఆర్‌ను కలిసినట్లు
భావించవచ్చు.
అయితే
సిఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలలో ప్రవేశించి నిలదొక్కుకోవడానికి ఇటువంటి సీనియర్ నేతల
సహాయసహకారాలు, మద్దతు ఎంతైనా అవసరం. కనుక ఇది శుభ పరిణామమే అని చెప్పవచ్చు.
వారి
సమావేశం ముగిసిన తర్వాత శంకర్ సింగ్ వాఘేలా మీడియాతో మాట్లాడుతూ, “నియంతృత్వ, అప్రజాస్వామిక మోడీ ప్రభుత్వంతో సిఎం కేసీఆర్ పోరాడుతున్న తీరు దేశంలో అందరినీ
ఆకట్టుకొంటోంది. కాంగ్రెస్ నాయకత్వ సమస్యతో బాధపడుతోంది. కనుక
దానికి ప్రత్యామ్నాయ రాజకీయశక్తి అవసరం. అది కేసీఆరే అని మేము నమ్ముతున్నాం. కనుక ఆయన
జాతీయ రాజకీయాలలో ప్రవేశిస్తే మేమందరం ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు సిద్దం,” అని అన్నారు.
సిఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ, “శంకర్ సింగ్ వాఘేలా వంటి సీనియర్ రాజకీయ నాయకుడు నా నాయకత్వాన్ని సమర్ధించడంతో నాపై మరింత బాధ్యత పెరిగింది. ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూనే, జాతీయ రాజకీయాలలో పాల్గొంటాను. కేంద్రంలో బిజెపికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు నావంతు ప్రయత్నం నేను చేస్తాను,” అని అన్నారు.