సమైక్యం, విమోచనం ఎవరి వాదనలు వారివే

September 16, 2022


img

రేపు తెలంగాణ విమోచన దినోత్సవం. రాష్ట్ర ప్రభుత్వం దీనిని అధికారికంగా జరిపేందుకు నిరాకరిస్తున్నందున కేంద్ర ప్రభుత్వం అధ్వర్యంలో  రేపు సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర మంత్రులు అధికారికంగా నిర్వహించబోతున్నారు. ఇప్పటికీ దానిని నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం వెనకాడితే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయి. దాంతో టిఆర్ఎస్‌ రాజకీయంగా నష్టపోతుంది. బిజెపి పైచేయి సాధించవచ్చు. కనుక రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి మూడు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవాల పేరుతో అట్టహాసంగా జరుపుతోంది. కనుక ఈ వేడుకల అర్దం, పరమార్దం రెండూ వేర్వేరని అర్దం అవుతోంది. కనుక అందుకు తగ్గట్లుగానే టిఆర్ఎస్‌, బిజెపి నేతలు వాదనలు కూడా వినిపిస్తున్నారు.  

నేడు సిరిసిల్లా జిల్లాలో జరిగిన సమైక్యత వజ్రోత్సవాలలో మంత్రి కేటీఆర్‌ ప్రసంగిస్తూ, “గతంలో జరిగిన గాయాలను మరిచిపోయి, అందరం కలిసి భవిష్యత్‌ వైపు అడుగులు వేయాలని మేము కోరుకొంటున్నాము. కానీ బిజెపి, కేంద్ర ప్రభుత్వం మానిన గాయాలను మళ్ళీ కెలికి పుండుగా చేసి హిందూ, ముస్లింలు కొట్లాడుకోవాలనే ఉద్దేశ్యంతోనే విమోచనం అంటూ హడావుడి చేస్తోంది. గతంలో జరిగిపోయినవాటి గురించి ఇప్పుడు తలుచుకొని కొట్లాడుకోవడం మంచిదా లేదా గతాన్ని మరిచి అందరూ హాయిగా జీవించాలనుకోవడం మంచిదా?అంటూ టిఆర్ఎస్‌ వాదనను బలంగా వినిపించారు. 

బండి సంజయ్‌ తదితర బిజెపి నేతలు ఏమంటున్నారంటే, “ఆనాడు నిజాం నవాబుకి చెందిన రజాకార్లు తెలంగాణ ప్రజలపై, ముఖ్యంగా మహిళలపై ఎన్నో అకృత్యాలు చేశారు. వారిని ఎదిరించే ప్రయత్నంలో అనేకమంది వీరులు అమరులయ్యారు. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా నిజాం నవాబు వరంగల్‌ జిల్లాలో పరకాలలో 21 మందిని అతికిరాతకంగా చంపించారు. భారత్‌లో కలిసేందుకు నిరాకరిస్తున్న నిజాం నవాబుపైకి సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ భారత్‌ సైన్యాన్ని పంపించి తెలంగాణ గడ్డను నిజాం నవాబుల నుంచి విముక్తి కల్పించారు. 

ఆనాడు మన తెలంగాణ సాయుధ పోరాటాలు, యోధుల బలిదానాలను ఎలా మరిచిపోగలం?కానీ టిఆర్ఎస్‌ పార్టీ ఒకవర్గం ఓట్ల కోసం, ప్రాపకం కోసం అమరుల పోరాటాలు, త్యాగాలు అన్నీ మరిచిపోయి నిజాం పాలకులను, రజాకార్లను పొగుడుతూ, మజ్లీస్‌ పార్టీతో దోస్తీ చేస్తోంది. తన రాజకీయ అవసరాల కోసం మన ఘనమైన చరిత్రను మజ్లీస్‌కు తాకట్టుపెట్టి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపించేందుకు ఇష్టపడటం లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం పూనుకోవలసి వచ్చింది,” అని వాదిస్తున్నారు.


Related Post